Close

కొత్త స్మార్ట్ కార్డులకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.. పూర్తిగా ఉచితం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 24/08/2025

రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహణ..

కార్డు ముందు భాగంలో కుటుంబ సభ్యుల ఫొటో, వెనుక ప్రభుత్వ వివరాలు ఉంటాయి…

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి కార్డుల పంపిణీకి చర్యలు..

కొత్త స్మార్ట్ కార్డులకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.. పూర్తిగా ఉచితం..

… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

జిల్లా వ్యాప్తంగా రేపటినుండి క్యూఆర్ కోడ్ ఆధారిత 5 లక్షల 51 వేల స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

ప్రభుత్వం రేషన్ పంపిణీని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించే లక్ష్యంగా పాత కార్డులు స్థానంలో రాజముద్రతో ఏటీఎం కార్డు సైజు లో ముద్రించిన క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రైస్ కార్డులను అందుబాటులో తీసుకొచ్చిందన్నారు. స్మార్ట్ రైస్ కార్డు పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్నింగ్ చేస్తే లబ్ధిదారుల పూర్తి వివరాలు ఆన్లైన్లో కనిపిస్తాయన్నారు. లబ్ధిదారుడు ఏ తేదీన, ఏ సమయంలో, ఏ యే వస్తువులను ఎంత పరిమాణంలో ఏ షాపులో తీసుకున్నది సులభంగా తెలుసుకోవచ్చు అన్నారు. జిల్లాలోని కార్డుదారులందరికీ స్మార్ట్ రైస్ కార్డులను ఇంటింటికి వెళ్లి అందజేయడానికి నాలుగు దశల్లో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆగష్టు 25 నుండి 31 వరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. సచివాలయ సిబ్బంది పంపిణీ చేయగా మిగిలిన కార్డులను సెప్టెంబర్ 1 నుండి 15 వరకు రేషన్ షాప్ డీలర్ ద్వారా రేషన్ షాప్ వద్దకు వచ్చిన కార్డుదారులకు ePoS డివైస్ ద్వారా డీలర్ అందజేస్తారన్నారు. సెప్టెంబర్ 16 నుండి 20 వరకు ఇంకా మిగిలిన కార్డులను మళ్ళీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కార్డుదారుల ఇంటి వద్దనే అందజేయడం జరుగుతుందన్నారు. అప్పటికీ కార్డులు తీసుకోకపోతే వాటిని సెప్టెంబర్ 21 తేదీన తగిన కారణాలతో తహ సీల్దార్ కార్యాలయంలో అందజేస్తారని, కార్డుదారులు అక్కడ నుండి పొందవచ్చు అన్నారు. ప్రభుత్వం వీటిని ఈ నెల 25న తొలివిడతగా తొమ్మిది జిల్లాల్లో పంపిణీ శ్రీకారం చుట్టగా, దీనికి మన జిల్లాను కూడా ఎంపిక చేయడం జరిగిందన్నారు. జిల్లా అంతటా పండుగ వాతావరణంలో రేపు ఆగస్టు 25న ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. అలాగే రేపు ఉదయం 10 గంటలకు పాలకొల్లు తహసిల్దార్ కార్యాలయంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కొత్త రైస్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.