Close

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ద్వారా పశ్చిమగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి–కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ.

Publish Date : 30/09/2025

మంగళవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఏసీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆర్ అండ్ బి, ఆర్ డబ్ల్యు ఎస్, వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖ, పౌరసరఫరాలు తదితర శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని వాటి ఫలాలు ప్రజలకు చేరాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద బ్యాంకులు లబ్ధిదారులకు విరివిగా రుణాలు మంజూరు చేసి పేద వర్గాల ఆర్థిక పురోగతికి చేయూతనివ్వాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారి జిల్లాలో చేపట్టిన జల జీవన్ మిషన్ పనుల గురించి వివరిస్తూ జిల్లాలో జెజెఎం క్రింద రూ.1,735 కోట్ల అంచనా వ్యయంతో 1,489 పనులకు ముంజూరు చేయడం జరిగింది అన్నారు. వీటిలో రూ.1,400 కోట్లను వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు మంజూరు చేయడం జరిగిందని, దీనికి అవసరమైన స్థల సేకరణను విజ్జేశ్వరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జెజెఎం క్రింద రూ.100.83 కోట్లు ఖర్చు చేసి 877 పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ జెజెఎం పనులు మంజూరు కాలేదో వివరాలను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి నాబార్డ్, సిఆర్ఎఫ్, సి ఆర్ ఐ ఎఫ్ పనులు ప్రగతి గురించి సంబంధిత అధికారులను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో భీమవరం శాసనసభ్యులు మాట్లాడుతూ భీమవరం యనమదుర్రు డ్రైన్ పై అసంపూర్తి నిర్మాణంలో ఉన్న మూడు వంతులకు అప్రోచ్ రోడ్డులతో పూర్తి చేయవలసి ఉందని దీనికి అంచనావేయంగా రూ.36 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ విషయమై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది తెలిపారు. తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ శాసనసభ్యులు మాట్లాడుతూ రోడ్లు గుంతలు పూడ్చడంతో ప్రయోజనం లేదని, మందపాటి సింగిల్ లేయర్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలు తీరును డిఎంహెచ్ఓ సమావేశంలో వివరించారు. వ్యవసాయ శాఖ పై సమీక్షిస్తూ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని రైతులు కోరిన విధంగా యూరియా సరఫరా చేయడం జరిగిందని, జిల్లాలో వ్యవసాయ రంగంలో డ్రోన్లు వినియోగంలో మన జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని తెలిపారు. అలాగే డ్వాక్రా మహిళలతో గుర్రపు డెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ తయారీని ప్రారంభించి రైతులకు అమ్మకాలు చేపట్టడం జరిగిందని, ఈ కంపోస్ట్ కు అధిక పోషక విలువలు ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో రుజువైందని వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు వివరించారు. గృహ నిర్మాణాలపై జరిగిన చర్చలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు టిడ్కో గృహ నిర్మాణాలపై ప్రస్తావిస్తూ పది సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టు కారణంగా కొంతమందికి వయోపరిమితి దాటిపోవడంతో లోన్లు మంజూరు కావడం లేదని, వారు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కొంతమంది కోరుతున్నారని ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు చేపట్టుతున్న ప్రచార ప్రక్రియను మంత్రికి వివరించారు. జీఎస్టీ సంస్కరణల అమలులో భాగంగా ధరల తగ్గుదలపై ప్రజలకు తెలియజేసేందుకు ఎగ్జిబిషన్స్, ర్యాలీలు, వర్క్ షాప్ లు సచివాలయ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలుత గత సమన్వయ కమిటీలు తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులు సమావేశానికి నివేదించారు.

ఈ సందర్భంగా సూపర్ జిఎస్టి….సూపర్ సేవింగ్స్ కరపత్రాన్ని కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, జెసి టి .రాహుల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ ఎం.శ్రీహరి, ఆర్డిఓ దాసిరాజు, డిపిఓ ఎం. రామనాథరెడ్డి, సిపిఓ కె. శ్రీనివాసరావు, డ్వామా పీ.డి డాక్టర్. కెసిహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, డిఎం అండ్ హెచ్ ఓ జి. గీతాబాయి, డి సి హెచ్ ఎస్ పి సూర్యనారాయణ, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, ఎల్ డి ఎం నాగేంద్రప్ర సాద్, ఆర్ అండ్ బి ఎస్. ఇ ఎ. శ్రీనివాస్, జిల్లా లేబర్ ఆఫీసర్ ఎ.లక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు కె.రామచంద్రారెడ్డి, ఏసుబాబు,టి.రామకుమార్, బి.విజయ సారథి, ఎం. అంజయ్య, జి.కృష్ణమోహన్, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.