కిషోర్ బాలికలు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదగాలి. జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్యకుమారి.
శనివారం తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని చిల్డ్రన్ హోమ్ ను రాష్ట్ర మహిళ శిశు సంక్షేమం, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ సెక్రటరీ మరియు పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలు ఏ విధంగా చదువుతున్నారు, వారికి అందుతున్న పౌష్టికాహారం, వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి వారంలో రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న అంశాలను వారు అడిగి తెలుసుకున్నారు. కిషోర్ బాలికలు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని హితవు పలికారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పౌష్టికాహారం తీసుకున్నప్పుడే శారీరక దృఢత్వం కలుగుతుందన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తేనే అనుకున్న గమ్యానికి చేరవచ్చు అన్నారు. చదువు ద్వారా ఉన్నత స్థానానికి ఎదిగినట్లయితే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది అన్నారు.
ఈ సందర్భంలో ఆర్డిఓ ఖతీబ్ కౌసర్ భానో, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు, ఎమ్మార్వో ఎం సునీల్ కుమార్, తదితరులు ఉన్నారు.