కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
ఆకట్టుకున్న వివిధ శాఖల అభివృద్ధి శకటాలు, స్టాల్స్.
అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పెరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో జిల్లా ఆర్మడ్ రిజర్వు, సివిల్ మెన్, ట్రాఫిక్ కాంటింజెంట్, ఎస్.టి.ఎఫ్ కాంటింజెంట్, విమెన్ కాంటింజెంట్, హోం గార్డ్స్ దళాలు గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం జిల్లా ప్రగతిపై సందేశాన్ని అందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనను తిలకించి, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు. పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డిఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి, భీమవరం ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి,
వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్, రవాణా అగ్నిమాపక శాఖ అధికారులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందేశమిస్తూ భారత దేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1950 జనవరి 26న ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యాంగ ఆవిర్భవించడం వల్లే భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయాలను పూర్తిస్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో సంతృప్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతోందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిని పేర్కొంటూ వ్యవసాయ రంగంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 1.03 లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఉద్యాన రంగం 19,199 హెక్టార్లలో విస్తరించి సుమారు 3,86,057 మెట్రిక్ టన్నుల దిగుబడితో అద్భుతమైన పురోగతి సాధిస్తుందన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా 85% రాయితీతో పశు బీమా కల్పించడమే కాకుండా 1936 పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ద్వారా 7.34 కోట్ల రుణాలను రైతులుకి అందించామన్నారు. జిల్లాలో 1.32 లక్షల విస్తీర్ణంలో చేపల, రొయ్యలు సాగు జరుగుతోందని, దీనిపై 24,677 మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఆక్వా సాగును క్రమబద్ధీకరించడానికి అప్సడ చట్టం కింద ఇప్పటి వరకు 63,995 ఎకరాలు నమోదు చేసామన్నారు. పాఠశాలల మౌలిక సదుపాయాలలో మన జిల్లా రాష్ట్రంలోని 2వ ర్యాంకు, విద్యా పనితీరులో 5ర్యాంకును సాధించి ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లాలో ఏడు ఐసిడిఎస్ ప్రాజెక్టులు పరిధిలో 1,626 అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సుమారు 51,000 మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలలో 2.17 లక్షల మందికి 94 కోట్ల రూపాయల పింఛన్లు అందజేశామన్నారు. జిల్లాలో 353 కోట్ల రూపాయలతో 412 కిలోమీటర్ల మీటర్ల రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటివరకు 83.95 శాతం గ్రామీణ గృహాలకు తాగునీటి కుళాయి కనెక్షన్లు అందించామన్నారు. జిల్లాలో 2025 -26 సంవత్సరాలలో 124.66 కోట్ల రూపాయలతో 2,828 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నెలకొల్పడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. మీ భూమి – మీ హక్కులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 47 గ్రామాలలో రీ సర్వే పూర్తయింది అన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలలో రైతులకు రాజముద్రలతో కూడిన 56 వేల పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధి మంచి ప్రగతి సాధిస్తున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
గణతంత్ర దినోత్సవ శుభ తరుణంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా జాయింట్ కలెక్టరు, జిల్లా అధికారులు మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షణకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం తమ సహాయ సహకారాలను అందిస్తున్న ప్రజాప్రతినిధులు, బ్యాంకర్లు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలిపారు.