కర్నూలు ఉల్లికి మార్కెట్ పెంపొందించే దిశగా ప్రత్యేకంగా ఉల్లితో తయారుచేసిన వంటకాలతో రైతులు, ట్రేడర్స్ తో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
కర్నూలు ఉల్లితో అన్ని రకాల వంటకాలు.. రైతులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్..
రాష్ట్రంలో పండించిన ఉల్లిపాయలను వినియోగించి రైతులకు బాసటగా నిలుద్దాం..
సోలాపూర్ ఉల్లి కన్నా మన కర్నూలు ఉల్లి ఎంతో రుచికరం..
జిల్లా ప్రజలు, విద్యాసంస్థలు కర్నూలు ఉల్లినే వినియోగించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది..
గురువారం తాడేపల్లిగూడెం ఉల్లి హోల్ సేల్ మార్కెట్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఉల్లి కొనుగోళ్ళను పరిశీలించి ట్రేడర్స్ తో, రైతులతో మాట్లాడారు. ఈరోజు ఎక్కడ నుండి ఉల్లి లోడ్లు వచ్చాయి, ఎన్ని మెట్రిక్ టన్నులు వచ్చాయి, ధర ఎంత పలుకుతుంది తదితర వివరాలను స్వయంగా అడిగి తెలుసుకుని పరిశీలించారు. కడప నుంచి వచ్చిన రైతు వద్ద రూ.6/- లు చొప్పున కొనుగోలు చేసినట్లు తెలుసుకొని రూ.9/- చొప్పున ధర చెల్లించాలని ట్రేడర్ కు చెప్పడంతో వారు అంగీకరించి తొమ్మిది రూపాయలు చొప్పున చెల్లించడం జరిగింది. ఈ సందర్భంలో రైతు సంతోషాన్ని వ్యక్తం చేసే జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనలతో అన్ని రకాల కూరలు ఉల్లిపాయలతో తయారు చేయించి ఉల్లి మార్కెట్ యార్డ్ నందు రైతులకు, ట్రేడర్స్ కు ఏర్పాటుచేసిన భోజనాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని రైతులతో కలిసి ఉల్లి వంటకాలను స్వయంగా రుచిచూశారు. కర్నూలు ఉల్లి వంటకాలు అద్భుతంగా ఉన్నాయని, సోలాపూర్ ఉల్లి కంటే కర్నూలు రుచిగా ఉంటాయన్నారు. వారి ఇంట్లో కూడా కర్నూలు ఉల్లినే వినియోగిస్తున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ప్రజలు నిత్య వినియోగానికి, వేడుకలకు, విద్యాసంస్థలు హాస్టల్స్ లో కర్నూలు ఉల్లినే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రిలయన్స్, డీమార్ట్ వంటి మెగా మార్ట్స్ లో కర్నూలు ఉల్లి అమ్మకాలకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, ఎప్పటికప్పుడు ఉల్లి అమ్మకాలపై సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంలో మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు, జిల్లా మార్కెట్ యార్డ్ ఏడి ఎం.సునీల్ కుమార్, తాహసిల్దార్ కె.సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు, రైతులు, హోల్సేల్ వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు.
