ఒకరితో ఒకరు కొట్లాడుకోకూడదు.. మంచిగా చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకుంటారు..
విద్యార్థులకు అమ్మలా విద్యాబుద్ధులు నేర్పిన కలెక్టర్ అమ్మ..
విద్యార్థులతో మమేకమై సహపంక్తి భోజనం…
విద్యకు ప్రాథమిక విద్యే బలమైన పునాది
పిల్లలు ఒకరికి ఒకరు విద్యలో సహాయంగా ఉండాలి..
లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యాన్ని సాధించాలి..
శనివారం జిల్లా కలెక్టర్ పాలకొల్లులోని మహాత్మ జ్యోతిరావు పూలే ఏపీ బీసీ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై కొంత సమయం వారికి పాఠాలను నేర్పించారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చదువుకుంటున్నారు, వసతి ఎలా ఉంది, ఆహారం బాగుంటుందా తదితర ప్రశ్నలకు సమాధానాలను రాబట్టారు. ఈ సందర్భంలో కొందరు విద్యార్థులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ స్నానాలకు వినియోగించే నీటి కారణంగా ఒళ్ళు దురదలు వస్తున్నాయని, తాగునీటిని ఎక్కువగా అందుబాటులో ఉంచాలని తెలియజేయడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజనానికి ముందు ప్రతిరోజు విద్యార్థులు ఆలపించే శ్లోకాన్ని జిల్లా కలెక్టర్ అనుకరించారు. ఈ సందర్భంలో విద్యార్థులతో ముచ్చటిస్తూ ప్రతిరోజు మెనూ ప్రకారం అందించే ఆహారాన్ని తప్పక తినాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని, అలాగే పౌష్టికాహారంతో కూడిన మెనూ కూడా తయారుచేసి ప్రభుత్వ పాఠశాలలో, వసతి గృహాల్లో విద్యార్థులకు అందించడం జరుగుతుందన్నారు. మీకు ఏదైనా సమస్య ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై మాట్లాడుతూ ప్రాథమిక విద్య పునాది వంటిదని, ఏ వృత్తి చేపట్టాలన్న ప్రాథమిక విద్య చాలా ముఖ్యమన్నారు. ఏడు నుండి తొమ్మిది తరగతి వరకు ప్రతి పాఠ్య పుస్తకాన్ని శ్రద్ధ చదివితే పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారని, భవిష్యత్తులో కూడా ప్రాథమిక విద్య పునాదిగా ఉంటుందన్నారు. పిల్లలు ఒకరికి ఒకరు చదువులో తోడుగా ఉండాలని, సరిగ్గా చదువలేని, ఉచ్చరించలేని వారిని గేలి చేయకుండా వారికి మీకు వచ్చినది నేర్పించాలన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఎల్లప్పుడు ధైర్యంగా ముందడుగు వేయాలన్నారు. క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ప్రతి దినం పాఠాలను చదివి పూర్తి చేయాలన్నారు. చదువుతోపాటు ఆటల్లో కూడా రాణించాలని తెలిపారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఎన్నటికీ మర్చిపోకూడదని, అలాగే మీ స్నేహ భావాన్ని కూడా విడనాడకూడదని హితవు పలికారు. మీరు తెలిపిన నీటి సమస్యకు కారణం నీటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన వాటర్ ఎరుపు రంగులో రావడం, వాటిని వినియోగించడం వలన దురదలు రావడం జరుగుతుందన్నారు. వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పిలిపించి పరీక్షలు చేయించి తగు చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఆదేశించారు.
ఈ సందర్భంలో డిఇఓ ఇ.నారాయణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సూరిబాబు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జి.సూర్య కుమారి, అసిస్టెంట్ ప్రిన్సిపల్ పి.శ్రీదేవి, డిప్యూటీ వార్డెన్ కే.ప్రవీణ్, ఎంఈఓ ఆర్ ఎమ్ ఎన్ వి ఎస్ జి శర్మ, తహసిల్దార్ వై.దుర్గా కిషోర్, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.