ఏసమ్మ బాధకు ఉపశమనం .. ఒక లక్ష రూపాయలు చెక్కును సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి అందుచేత.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

రాష్ట్ర ముఖ్యమంత్రి తణుకు పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీకై పరుగులు పెట్టిన అధికారులు…
ఫోటో ఆధారంగా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తణుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఇల్లు జల్లెడ పట్టి బాధితురాలని వెతికి పట్టుకున్న వైనం..
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఒక లక్ష రూపాయలు బాధిత మహిళకు అందజేత…
ముఖ్యమంత్రి దయాద్ర హృదయానికి కృతజ్ఞతలు తెలిపిన బాధిత మహిళ..
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో మార్చి 15న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును సభ అనంతరం ప్రధానంగా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన నందివాడ ఏసమ్మ ఆమె కుమారుడుతో కలిసి కొడుకు వాస్తవ పరిస్థితిని చూపిస్తూ, నా కుమారుడు మానసిక వికలాంగత్వంతో సరిగ్గా నడవలేని, మాట్లాడలేని, ఏ విషయం తెలియ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడని, 17 సంవత్సరాలుగా బిడ్డను సాకడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, 14 సంవత్సరాల క్రితమే భర్తను కూడా కోల్పోయానని ముఖ్యమంత్రి వద్ద బోరున విలపిస్తూ కన్నీటి పర్యాంతమైంది. కనీసం వికలాంగుల పెన్షన్ అయినా మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని నోటి మాటగ మాత్రమే కోరడం జరిగింది. సీఎం చర్యలు తీసుకుంటాను అని ఆమెకు బదులు ఇవ్వడం, సభ ముగిసిపోవడంతో అందరూ వెళ్లిపోవడం జరిగింది. ఆమె ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితులను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ను ఆదేశిస్తూ ఒక లక్ష రూపాయలు వారి బిడ్డ పేరున డిపాజిట్ చేసేందుకు సీఎంఆర్ఎఫ్ నిధులు నుండి మంజూరు చేయాలని ఆదేశించడం జరిగింది. సదరు మహిళ ఏ విధమైన దరఖాస్తు అంద చేయకపోవడంతో ఆమె వివరాలు ఏమీ లేక, ఆమె ఫోటో ఆధారంగా ఆచూకీ తెలుసుకోవడానికి పోలీస్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది రెండు రోజులు చుట్టుపక్కల గ్రామాలన్నీ జల్లెడ పట్టి ఎట్టకేలకు సదన మహిళ ఆచూకీ కనుగొనడం జరిగింది. ఆమెకు, ఆమె బిడ్డకు సహాయకంగా విఆర్ఏను జత చేసి భీమవరం కలెక్టరేట్ కు తీసుకొచ్చి ఒక లక్ష రూపాయల చెక్కును గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా అందజేసి, చెక్కను డిపాజిట్ చేసి పాస్ బుక్ ను అందజేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా తహసిల్దార్ ను ఆదేశించడం జరిగింది.
ఈ సందర్భంగా బాధిత మహిళ నందివాడ ఏసమ్మ మాట్లాడుతూ నాకు ఇద్దరు పిల్లలు అని నా భర్త 2011లో కామెర్లు కారణంగా చనిపోయారని అప్పటినుండి ఇళ్లల్లో పని చేసుకుంటూ దివ్యంగుడైన నా కుమారుడితో జీవిస్తున్నానని, నాకు వితంతు పెన్షన్ గాని, నా కుమారునికి వికలాంగ పెన్షన్ గాని మంజూరు కాలేదని, నివాసానికి ఇల్లు కూడా లేదని జిల్లా కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేయగా పెన్షన్ మంజూరుకు ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకుంటామని, ఇళ్ల స్థలం కేటాయించి గృహ నిర్మాణం చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలుపుతూ తహసిల్దార్ ను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా నందివాడ ఏసమ్మ మాట్లాడుతూ సీఎంగారు దయాద్ర హృదయంతో చేసిన సహాయం ఎన్నటికీ మరువలేనిదని, ఇంత మొత్తం నేను చూసింది కూడా లేదని, నేను కేవలం నా కుమారుడి పెన్షన్ మంజూరు కోసం మాత్రమే ముఖ్యమంత్రికి విన్నవించడం జరిగిందని, ఒక లక్ష రూపాయలు కూడా అందజేయడం నా జీవితంలో ఊహించలేనిదని, నా కుమారుడిని ఎలా సాకాలో, నేను లేని రోజున నా కుమారుని పరిస్థితి ఏమిటో అని ఎల్లప్పుడూ మదన పడుతూ ఉండేదాన్ని అని, నేటితో నా భారం అంతా ముఖ్యమంత్రి చేసిన సహాయంతో తొలగిపోయిందని చాలా సంతోషాన్ని, కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.
చెక్కును అందజేస్తున్న సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, తాడేపల్లిగూడెం ఆర్డీవో కతిబ్ కౌసర్ భానో, తణుకు తహసిల్దార్ డివివిఎస్ అశోక్ వర్మ, వీఆర్ఏ వున్నారు.