ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు హెచ్ ఎల్ ఓ మొబైల్ యాప్ లో ఎవరికి వారు స్వయంగా వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోవచ్చు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
2027 జనాభా లెక్కల సేకరణను నూరు శాతం విజయవంతం చేయాలి.
మొదటి దశలో మే 1 నుండి 30వ తేదీ వరకు నిర్వహించే గృహ గణన నమోదు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి సమర్థవంతంగా నిర్వహించాలి.
2027 జనాభా లెక్కల సేకరణలో విధివిధానాలపై అధికారులు సంపూర్ణ అవగాహనతో పని చేసి కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు
కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారుల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల సేకరణ దేశంలో 16వది కాగా, స్వాతంత్ర్యం అనంతరం 8వ జనగణన అని తెలిపారు. ఎన్నికల నిర్వహణ మాదిరిగానే జనాభా లెక్కల సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు భవిష్యత్తులో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు బడ్జెట్ కేటాయింపులు ఈ గణాంకాలపై ఆధారపడి ఉంటాయని తెలిపారు. అందువల్ల గణాంకాల సేకరణలో ఎటువంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా పనిచేయాలని ఆదేశించారు.
జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని ఆమె వివరించారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ (హెచ్ఎల్ఓ), రెండవ దశలో జనగణన నిర్వహించబడుతుందని చెప్పారు. మొదటి దశలో భాగంగా గృహ గణన నమోదు ప్రక్రియ మే 1 నుండి మే 30 వరకు జరుగుతుందని తెలిపారు. గుర్తించిన ప్రతి గృహానికి ప్రత్యేక నంబర్ కేటాయించి, ఆ గృహంలో నివసించే సభ్యుల వివరాలు నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. గృహ గణనలో భాగంగా గృహ మౌలిక సదుపాయాలు, గృహోపకరణాలు, ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు, గోడలు, ఫ్లోరింగ్, త్రాగునీటి వినియోగం, మరుగుదొడ్ల వాడకం తదితర మొత్తం 34 అంశాలపై వివరాలు సేకరించబడతాయని తెలిపారు. ఈ ప్రక్రియను మొట్టమొదటి సారిగా డిజిటల్ విధానంలో చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ 16 నుండి 30 వరకు హెచ్‌ఎల్‌ఓ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అధికారులు నేటి నుండి మూడు రోజులపాటు జరిగే శిక్షణా కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరై గృహ గణన విధి విధానాలపై పూర్తి అవగాహన పొందాలని కలెక్టర్ సూచించారు. ఎన్యుమరేటర్లు బాధ్యతాయుతంగా ప్రత్యేక శ్రద్ధతో విధులు నిర్వహించాలని
ఆదేశించారు.
ఈ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్, హైదరాబాద్ నుండి విచ్చేసిన సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ జీ.వి.చంద్రకళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గృహ గణన నమోదు ప్రక్రియను సవివరంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీవోలు దాసిరాజు, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, స్టాటిస్టికల్ అధికారులు మరియు సెన్సస్ ఆపరేషన్స్ బృంద సభ్యులు చంద్రకళ, సోనీ యాదవ్, తరుణ్, దేవేంద్ర నాయక్, భాగ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.