ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు నూరు శాతం రాయితో పీఎం సూర్య ఘర్ సోలార్ ప్యానల్స్ అమరిక పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సీ/ ఎస్టీ గృహాలకు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన వెలుగులు
ఎస్సీ, ఎస్టీ గృహాలకు నూరు శాతం సబ్సిడీతో సోలార్ ప్యానల్స్ అమరిక
ఒక్కొక్క కుటుంబానికి నూరు శాతం ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు రూ.1.20 లక్షలు కాగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూ.60 వేలు
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పథకం అమలుకు ఏప్రిల్ 13, 2026 ఉంది
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల గృహాలలో విద్యుత్ వెలుగులు నింపేందుకు పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద ఉచితంగా సోలార్ ప్యానల్స్ అమరికకు సంకల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ఎస్పీ ఎస్పీ వర్గాల గృహాలకు పీఎం సూర్య ఘర్ పథకం కింద నూరు శాతం సబ్సిడీతో అమలు చేస్తున్న సోలార్ ప్యానల్స్ అమరిక కార్యక్రమాన్ని సోమవారం జిల్లాలో మొట్టమొదటిగా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, దీనిలో భాగంగా పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా మరొక సంక్షేమాన్ని నూరు శాతం సబ్సిడీతో అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో మొట్టమొదటిగా నేడు నీలాద్రిపురంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. మన ముఖ్యమంత్రికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టము అని, టెక్నాలజీ గ్రామాలకు కూడా అందించే లక్ష్యంతో ఈ విధంగా సోలార్ ప్యానల్స్ ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అందరికీ చేరవేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ఒకటిన్నర సంవత్సరంగా జిల్లాలో ఉన్న కుటుంబాలకి సబ్సిడీపై సోలార్ ఎనర్జీని పియం సూర్య ఘర్ ద్వారా ప్రతి ఇంటికి సబ్సిడీతో ప్యానల్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నా అన్నారు. వారు వినియోగించుకున్న విద్యుత్ పోను గ్రిడ్జ్ కు అందించిన దానికి మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయడం కూడా జరుగుతుందన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో మన జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 5 వేల గృహాలకు మాత్రమే కనెక్షన్లను ఇవ్వడం జరిగింది అన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు నూరు శాతం సబ్సిడీపై ఈ ప్రాజెక్ట్ అమలులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో తొలి విడతలో సుమారు 22,855 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూ.260.18 కోట్ల రూపాయలు విలువ కలిగిన 2 కిలో వాట్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ప్ప్యానల్ అమర్చడం జరుగుతుందని తెలిపారు. 60 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ద్వారా సబ్సిడీ అందిస్తున్నదని, మిగిలిన మొత్తం ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుందన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 8,403 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాల లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, వీరిలో తొలి విడతగా 3,273 కుటుంబాలకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన 6,546 కుటుంబాలకు దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఎంత పని చేసినా అధికారులు దాన్ని అమలుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని, నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ సహకారం ఎంతో విలువైనదని కొనియాడారు. పిఎం సూర్య ఘర్ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు రూ.1.80 లక్షల విలువైన సోలార్ ప్యానల్స్ ను నూరు శాతం సబ్సిడీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు కరెంట్ ను కొనుక్కోకుండా సోలార్ ప్యానల్స్ ఉచితంగా అందించడంతో ఉచిత విద్యుత్తును పొందగలుగుతారు అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎస్సీ, ఎస్టీ సోదరులు పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉన్నటువంటి విదేశీ అంబేద్కర్ విద్యను, ఎస్సీ,ఎస్టీ సబ్సిడీ లోన్స్ అందించకపోయిన నేడు కూటమి ప్రభుత్వం అందించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ, మిమ్మల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచనతో ఒక్కొక్క లబ్ధిదారులకు రూ.1.20 ఖర్చుచేసి ఈ పథకాన్ని అమలు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదన్నారు. అలాగే బడ్జెట్ కేటాయింపుల్లో కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి పులి ఉషారాణి, ఆర్డిఓ ఖతిబ్ కౌసర్ భానో, టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకాశం స్వామి, తహసిల్దార్ రాజరాజేశ్వరి, సర్పంచ్ లక్ష్మణరావు, జడ్పిటిసి ఆంజనేయులు, ఎంపీపీ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ శేషు లత, కూటమి నాయకులు ఈతకోట తాతాజీ, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పసల కొండ, సాలూరు వెంకటేశ్వరరావు, కే రామారావు, తదితర స్థానిక నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.