ఎస్టీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు గృహ నిర్మాణాలలో ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక లబ్ధిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాడ తెలిపారు.

ఎస్సీలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు 75,000 రూపాయలు
ఏప్రిల్ 2025లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్న వారికి అదనపు ఆర్థిక లబ్ధి
..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
బుధవారం తణుకు మండలం వేల్పూరు లేవుట్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి, గృహ నిర్మాణాలు చేపట్టినవి ఎన్ని, చేపట్టాల్సినవి ఎన్ని, ప్రారంభించి పునాది దశలో ఉన్నవి ఎన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది ఉన్నారు, వారికి చేపట్టిన గృహ నిర్మాణాలు ఏఏ దశల్లో ఉన్నాయి ఆరా తీశారు. ఈ సందర్భంగా కాలనీలోని బీసీ లబ్ధిదారు నల్లి అన్నపూర్ణ, ఎస్సీ లబ్ధిదారు పంతగాని మంగ, తదితర లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ స్వయంగా మాట్లాడి గృహ నిర్మాణాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక లబ్ధిని వివరించారు. పీఎంఏవై గ్రామీణ్, అర్బన్ లో ఇల్లు మంజూరై ఇంకనూ వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్ విలువకు అదనంగా ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కూడా విడుదల చేయడం జరిగిందన్నారు. ఎస్సీలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు 75,000 రూపాయలు గృహ నిర్మాణాలకు అదనంగా ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. గృహనిర్మాణం పూర్తికి యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీలు, బీసీలు అందరికీ రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తుందని తెలిపారు. అయితే వీటి నిర్మాణాలను ఏప్రిల్ 2025 లోగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. నిర్మాణం పూర్తి చేసుకొనే దశల వారీగా అదనపు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాకు నేరుగా జమ చేస్తారన్నారని జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 18,340 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాలు వివిధ దశలలో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. బి.సిలు 12,362, ఎస్సీలు 5,593, ఎస్టీలు 385 లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. గృహ నిర్మాణ ఇండ్లు మంజూరైన వివిధ దశలలో లో ఉన్న లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు 75,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్ విలువకు అదనంగా ఆర్ధిక సహాయం అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగినదన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీలు అర్హత కలిగిన ప్రతి ఇంటిని తనిఖీ చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే గృహ నిర్మాణ శాఖ అధికారులు కూడా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గ్రామ, వార్డు ఎమెనిటిస్ సహాయకులు, ఎంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు ఈ విషయాన్ని విసృతంగా ప్రచారం చేసి లబ్దిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడంలో నిధుల మంజూరు కొరకు మధ్యవర్తులు, ఇతరుల మోసపూరిత మాటలు నమ్మరాదని, ఏమైన సమస్యలు ఉన్న యెడల సంబంధిత మండల గృహ నిర్మాణ కార్యాలయం, ఎంపిడివో, మున్సిపల్ కమీషనర్లను సంప్రదించాలన్నారు. కావున లబ్దిదారులు అందరు ప్రభుత్వం అందిస్తున్న ఈ అదనపు ఆర్ధిక లబ్ది సదవకాశాన్ని వినియోగించుకొని తమ సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ సందర్భంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, ఈ ఈ ఎం.శ్రీనివాస్. డిఈ కే కే డి టి ప్రసాద్, తహసిల్దార్ డివివిఎస్ అశోక్ వర్మ, సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు, తదితరులు ఉన్నారు.