ఎరువులు ఎంత తక్కువగా వినియోగిస్తే రైతులకు, రాష్ట్రానికి అంతగా ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
మంగళవారం భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “పొలం పిలుస్తుంది” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని, ఈ పంట నమోదు, అధిక ఎరువుల వినియోగం అనర్ధాలు, పి.ఎం ప్రణామ్ తదితర కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తొలుత భోగి రెడ్డి కృష్ణమూర్తి పంట పొలం ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ వెరైటీ సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాలు ఉంది, ఎకరాకి యూరియా ఎన్ని బస్తాలు వినియోగిస్తున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని సమావేశంలో మాట్లాడుతూ రసాయనికి ఎరువులు, పురుగుమందులు వాడకాన్ని తగ్గించి ఆధునిక పద్ధతులతో సేంద్రీయ పద్ధతులను మేళవించి పంటసాగును చేపట్టాలన్నారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎరువుల లభ్యతపై రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమన్వయం చేస్తున్నారని తెలిపారు. అదృష్టవశాత్తు మన జిల్లాలో ఎరువులు కొరత లేదన్నారు. అధిక ఎరువుల వాడకం వలన ఆరోగ్యానికి తీవ్ర నష్టం తీసుకొస్తుంది అన్నారు. క్యాన్సర్ వంటి రోగాలకు కారణం అవుతుంది అన్నారు. రబి పంట అనంతరం వ్యవసాయ శాఖ ఉచితంగా అందజేసే నవధాన్యాలను పొలాలలో వెదజల్లడం వల్ల భూమిలో మైక్రో న్యూట్రియన్స్ పెరుగుదలకు దోహదపడతాయన్నారు. తద్వారా ఎరువుల వినియోగం తగ్గి భూమికి సారం పెరిగి దిగుబడి ఎక్కువ వస్తుందని సూచించారు. జిల్లాలో 42 డ్రోన్లు అందుబాటులో ఉంచడం జరిగిందని, డ్రోన్ పోర్టల్ లో రిక్వెస్ట్ పెట్టుకోని వినియోగించుకోవాలన్నారు. కృత్రిమ ఎరువులు తగ్గించుకోగలిగితే రైతులకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ను రాష్ట్రానికి అందించడం జరుగుతుందన్నారు. యూరియాకి ప్రత్యామ్నాయంగా నానో యూరియా లిక్విడ్ని వినియోగించాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఎరువులు వాడకం తగ్గించడం కారణంగా 350 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని, వీటిని రైతుల ప్రయోజనాలకు పవర్ ట్రిల్లర్స్, డ్రోన్లు తదితర యంత్ర సామాగ్రిని కొని రైతులకు అందజేయడం జరిగిందన్నారు. ఒక యూరియా బస్తా అసలు ఖరీదు రూ.2,200/- అవుతుందని, దీనిపై సబ్సిడీ రూ.1,985/- లను కేంద్ర ప్రభుత్వం అందించి, రైతుకు కేవలం రూ.270/- లకే అందజేయడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఎరువులపై సబ్సిడీనీ ఇవ్వడం జరుగుతుందని, రైతులు అవసరం మేరకే ఎరువులు వినియోగం చేస్తే, సబ్సిడీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు ప్రయోజనాలకు గ్రాంట్ గా మంజూరు చేస్తుందని వివరించారు. ఎక్కువ యూరియా వాడిన ప్రయోజనం ఉండదని, పంట 25 శాతం మాత్రమే గ్రహించి మిగతాది వృధాగా పోతుందనేది గమనించాలన్నారు. పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువుల వినియోగంతో అధిక లాభాలతో పాటు, ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రయోజనం చేకూర్చినవారు అవుతారని సందర్భంగా తెలిపారు. స్థానికంగా వినియోగించే వరి వంగడాలను మాత్రమే సాగు చేయాలని తెలిపారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేలా రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణామ్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా రసాయన ఎరువులపై సబ్సిడీల భారాన్ని తగ్గించాలని లక్ష్యంగా సబ్సిడీ పొదుపులో 50 శాతం ఆదా చేసే రాష్ట్రంలో పీఎం ప్రణామ్ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్. కే ఏ ఎస్ ఎస్ శ్రీనివాసరావు, ఏవోలు వైవిఎస్ ప్రసాద్, జెడ్ బాల నాగేశ్వరమ్మ, సర్పంచ్ బి రామమూర్తి, ఎంపీడీవో ఎం మురళి గంగాధర్ రావు, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ భోగిరెడ్డి కృష్ణమూర్తి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.