Close

ఎన్ హెచ్ 165 భూసేకరణకు భూములను ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన వీరవాసరం గ్రామ రైతులు-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 18/07/2025

జాతీయ రహదారి 165 నిర్మాణంలో భాగంగా వీరవాసరం గ్రామ రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై శుక్రవారం వీరవాసరం తహసిల్దార్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జాతీయ రహదారుల అధికారుల సమక్షంలో విచారణ చేపట్టడం జరిగింది. భూసేకరణపై జూన్ 14 న అభ్యంతరాలు గడువు ముగియడంతో, వీరవాసరం గ్రామానికి చెందిన18 మంది రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈరోజు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డు అలైన్మెంట్, తమ భూమికి లభించే నష్టపరిహారం చెల్లింపు తదితర విషయాలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అలైన్మెంట్ మార్పు తమ పరిధిలోనిది కాదని, నష్టపరిహారం విషయంలో సర్వే నంబర్ ప్రకారం సమీప ప్రాంతాలలో గత మూడు సంవత్సరాలగా జరిగిన లావాదేవీలను చూసి సరాసరిన ప్రభుత్వ నిబంధన ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. తమ భూములను ప్రభుత్వానికి అప్పగించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని కాకపోతే తాము నష్టపోకుండా హెచ్చు మొత్తములో న్యాయమైన నష్టపరిహారం సాధ్యమైనంత త్వరగా ఇప్పించాలని జాయింట్ కలెక్టరును రైతులు కోరారు. అలాగే అలైన్మెంట్ ఏ సర్వే నెంబర్ నుండి వెళ్తుంది అనే వివరాలను రైతులు కోరగా, త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను అందజేస్తామని తెలిపారు.

ఈ విచారణలో ఎన్.హెచ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అండ్ బి ఎన్.శ్రీనివాస్ రావు, తాహసిల్దార్
ఏ వి రామాంజనేయులు, సబ్ రిజిస్టర్ ఎన్.కమల కుమారి, కలెక్టరేట్ ల్యాండ్ సూపటెండెంట్ సి హెచ్ రవికుమార్, డిటి జి. కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.