ఎన్నికల నియమ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిపై సంపూర్ణ అవగాహనతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఎన్నికల నియమ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిపై సంపూర్ణ అవగాహనతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ప్రతి అధికారి, సిబ్బంది ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నియమ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. జిల్లాలో ఎక్కడ చిన్న సమస్య తలెత్తినా అది మొత్తం ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
శనివారం భీమవరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఎన్నికల విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నవంబరు 3వ తేదీన పోలింగ్, నవంబరు 5వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల విధులకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా సుమారు 7,500 మంది సిబ్బంది అవసరమవుతారని తెలిపారు. ఎన్నికల విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరికీ తమ బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
గతంలో పలుమార్లు ఎన్నికల విధులు నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ, ప్రతి ఎన్నికను ప్రత్యేకమైనదిగా పరిగణించి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణ పట్ల ప్రతి అధికారి, సిబ్బంది పూర్తి నిబద్ధతతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలు, విధివిధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలు, అధికార పరిధి, అనుసరించాల్సిన విధానాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. శిక్షణలో వివరించిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని సూచించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సున్నితమైన అంశాలు, భావోద్వేగాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.
ఎన్నికల సమయంలో ఎక్కడైనా చిన్న సమస్య తలెత్తినా, దాని ప్రభావం జిల్లా మొత్తం ఎన్నికల నిర్వహణపై పడే అవకాశం ఉంటుందని తెలిపారు. అందువల్ల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ఏజెంట్లకు నిబంధనల ప్రకారం అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా తెలియజేయడంతో పాటు, ఎన్నికలకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.
ఎన్నికల విధులపై శిక్షణ అందించే ట్రైనర్లు ప్రతి నియమాన్ని, విధివిధానాన్ని స్పష్టంగా వివరించాలని కలెక్టర్ సూచించారు. మండల స్థాయిలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో సంబంధిత మండల అధికారులు, ఎన్నికల విధులకు సంబంధించిన అధికారులు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసేలా పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
ఎన్నికల విధుల్లో ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఎదురైతే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికతకు ప్రాధాన్యతనిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి, సిబ్బంది సమన్వయంతో పనిచేసి, పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అన్ని దశలను నిబంధనలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరియా, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ పి. ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.