ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన సాధారణ పరిశీలకులు బి. నవ్య (ఐఏఎస్)
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన సాధారణ పరిశీలకులు బి. నవ్య (ఐఏఎస్)
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సాధారణ ఎన్నికల పరిశీలకులు బి. నవ్య (ఐఏఎస్), వ్యయ పరిశీలకులు అహ్మద్ అబ్దుల్ రావుఫ్ షేక్ (ఐఎఫ్ఎస్), జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ఆదివారం, ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో పర్యటించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆకివీడు నగర పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి నామినేషన్ల దాఖలు ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతోందని తెలిపారు.
అనంతరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీమతి సరోజినీ నాయుడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సాధారణ ఎన్నికల పరిశీలకులు బి. నవ్య ఆదేశించారు.
ఈ సందర్భంగా స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా కొనసాగుతోందని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుందని పేర్కొన్నారు. అక్టోబరు 19వ తేదీ సోమవారం నామినేషన్ల పరిశీలన, 21వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అక్టోబరు 28వ తేదీన పోలింగ్, 30వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు.
వ్యయ పరిశీలకులు అహ్మద్ అబ్దుల్ రావుఫ్ షేక్ మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని నిబంధనలకు అనుగుణంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, ఆర్డీఓ కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ రఘువీర విష్ణు, మున్సిపల్ కమిషనర్ జి. కృష్ణమోహన్, తహసీల్దార్ దశిక వంశీ తదితరులు పాల్గొన్నారు.