Close

ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 01/07/2025

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్‌ సామాజిక భరోసా నెలవారి పింఛన్ల పథకంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి పెనుమంట్ర మండలం, ఆలమూరు గ్రామం ఇందిరమ్మ కాలనీలో పర్యటించి స్వయంగా లబ్దిదారులకు పింఛన్లు అందజేసి వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా, లేదా అంటూ ఆరా తీశారు. ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందిస్తున్నట్లు కలెక్టర్ కు లబ్ధిదారులు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ఉదయం 6.00 గంటల నుంచి జిల్లాలో 4,600 సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,23,837 మంది లబ్దిదారులకు గాను 1.18 లక్షలు వృద్ధులు, 49 వేలు వితంతువులు, 6 వేల తొమ్మిది మంది ఒంటరి మహిళలు, 4,500 మంది మత్స్యకారులు, 2,500 మంది చేనేత, 27 వేల విభిన్న ప్రతిభావంతులు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మొత్తం రూ.96.51 కోట్లు పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. సాయంత్రానికి నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తయ్యేలా ఏర్పాటు చేశామని కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు.

ఈ కార్యక్రమంలో పెనుమంట్ర తహాసిల్దార్ వై.రవి కుమార్, ఎంపీడీఓ జి.ఎస్ ప్రభాకర్ రావు, సర్పంచ్ మేడపరెడ్డి వెంకటరమణ, పితాని వెంకట సురేష్, పంచాయతీ కార్యదర్శి ఎం.సుధారాణి, ఎంపీటీసీ పలివెల ఆశాలత, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.