ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్మును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి .రాహుల్ కుమార్ రెడ్డి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన వారికి అందిస్తున్న పెన్షన్ సొమ్మును వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
సోమవారం ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని వృద్ధులు, వికలాంగులకు, పింఛను సొమ్మును స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు గౌరవంగా బ్రతకాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్మును ప్రతినెల ఒకటవ తేదీన అందిస్తుందని అన్నారు. ఎటువంటి దుబరా ఖర్చులు చేయకుండా మంచిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి నెల ఒకటో తేదీ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఉద్యోగులు పింఛన్ సొమ్ము ను అందజేస్తున్నారా, మీకు ఎటువంటి ఇబ్బందులైనా కలుగుతున్నాయ అని లబ్ధిదారులను అడిగారు. ప్రతినెల ఉదయాన్నే మా ఇంటి వద్దకు వచ్చి పింఛను సొమ్మును అందిస్తున్నారని, ఎటువంటి ఇబ్బందులు లేవని జాయింట్ కలెక్టర్ వద్ద సంతోషాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలోని ఇద్దరు ప్రతి నెల 15 వేల రూపాయలు పెన్షన్ వచ్చేదని, ప్రస్తుతం పెన్షన్ నిలిపి వేసారని జాయింట్ కలెక్టర్ వద్ద విన్నవించుకున్నారు. ఎందు వలన పెన్షన్ ఆగినది పరిశీలించాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఎటువంటి జాప్యము లేకుండా అర్హులందరికీ పింఛన్ సొమ్మును వారి ఇంటి వద్దకు వెళ్లి అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సిబ్బందినీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎన్.వెంకటేశ్వరరావు, ఎంపీడీవో మార్కండేశ్వరరావ్, గ్రామ సర్పంచ్ విశ్వేశ్వరరావు, పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.