@ ఎంపీపీ, జడ్పీపీ పరోక్ష ఎన్నికల నిబంధనల్లో సవరణలు..
@ ఎంపీపీ, జడ్పీపీ పరోక్ష ఎన్నికల నిబంధనల్లో సవరణలు…
@ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక నోటిఫికేషన్
@ నేడు ఎంపీపీ, రేపు జడ్పీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు యథాతథo… జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి చదలవాడ నాగరాణి వెల్లడి….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, 2026 మండల ప్రజా పరిషత్ (MPP), జిల్లా ప్రజా పరిషత్ (ZPP) పరోక్ష ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో ప్రభుత్వం కీలక సవరణలు చేసిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సవరణల ప్రకారం మండల మరియు జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కావున, నవంబర్ 19, 20 తేదీలలో ఎంపీపీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు, అలాగే నవంబర్ 20, 21 తేదీలలో జడ్పీపీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహించబడవు అని స్పష్టం చేశారు.
అయితే, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు యథాతథంగా జరుగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. నవంబర్ 19న మధ్యాహ్నం 1:00 గంటకు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ (MPTC) సభ్యులచే ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారని, అనంతరం ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికను నిర్వహిస్తారని తెలిపారు.
అదేవిధంగా, నవంబర్ 20న మధ్యాహ్నం 1:00 గంటకు నూతన జడ్పీటీసీ (ZPTC) సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం, జడ్పీపీ ఛైర్పర్సన్ మరియు వైస్-ఛైర్పర్సన్ ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ప్రిసైడింగ్ అధికారులు సభ్యులకు, ఎక్స్-అఫీషియో సభ్యులకు జారీ చేసిన నోటీసులు యథాతథంగా చెల్లుబాటు అవుతాయని, ఈ నిబంధనల సవరణలను ప్రత్యేక సమావేశాల్లో సభ్యులందరి దృష్టికి తీసుకురావాలని ప్రిసైడింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.