ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఆర్ ఓ లు, ఏ ఆర్ ఓలకు పూర్తి అవగాహన ఉండాలి జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఆర్ ఓ లు, ఏ ఆర్ ఓలకు పూర్తి అవగాహన ఉండాలి
జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నిబంధనలు విధివిధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అన్నారు.
కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం,2026 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ పత్రాల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా తయారీ, గుర్తుల కేటాయింపు, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల సంఘం జారీ చేసే మార్గదర్శకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, సందేహాలుంటే శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన రికార్డులు, నివేదికలు, ఇతర అధికారిక పత్రాలను నిబంధనల ప్రకారం నిర్వహించాలన్నారు.
ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను నిర్ణీత నిబంధనలు, కాలపరిమితికి అనుగుణంగా పూర్తి చేసి, ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సూచించారు.
ముందుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి. రమణ, ఎంపీటీసీ జడ్పిటి సి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పి.గ్లోరియా,కలెక్టరేట్ కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ బి పి.ప్రభాకర్ రావు,డిప్యూటీ సీ ఈ వో వై దోసిరెడ్డి, డ్వామా పిడి డా.కె సి హెచ్ అప్పారావు,డి పి ఓ పి. విజయ భాస్కర్, ఆర్ ఓ లు, ఏ ఆర్ ఓ లు, తాహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.