Close

ఉప్పుటేరు వద్ద కొల్లేరు వరద నీటి ఇబ్బంది లేని విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 09/09/2024

సోమవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులోని ఆకివీడు మండలం దుంపగడప వద్ద ఉప్పుటేరులో గుర్రపు డెక్క, కిక్కిస తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ ఆస్మి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు. కొల్లేరు నీరు ఉప్పుటేరు ద్వారా మాత్రమే సముద్రంలో కలుస్తుందన్నారు. కొల్లేరు ఉప్పుటేరు వద్ద కలిసే ప్రాంతంలో నీటి ప్రవాహానికి కిక్కిస అడ్డంకిగా ఏర్పడిందన్నారు. ఉప్పుటేరు రైల్వే బ్రిడ్జి, ఆర్ అండ్ బి బ్రిడ్జి దిగు భాగంలో జరుగుతున్న కిక్కిస తొలగింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొల్లేరులో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ సరిహద్దు మండలం ఆకివీడులోని సిద్దాపురం, చిన్నమిల్లిపాడు గ్రామాల వద్ద పంట పొలాల్లోనికి చొచ్చుకు వస్తున్న వరద నీటిని వీరు పరిశీలించారు. కొల్లేరు తీర మండలం అయిన ఆకివీడు వద్ద ఉప్పుటేరు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. అవసరమైన ప్రాంతాల్లో మట్టి బస్తాలతో అడ్డుకట్టలు వేయించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ లు ఉప్పుటేరును పరిశీలించిన సందర్భంలో మాట్లాడుతూ ఉప్పుటేరులో యుద్ధప్రాతిపదికన పొక్లెయిన్ తో గుర్రపుడెక్క మేటలు తొలగించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. గత వారం రోజులుగా ఉప్పుటేరులో మేటల్ని తొలగించే చర్యలు చేపట్టారన్నారు. రైల్వే వంతెన వద్ద, ఆర్ అండ్ బీ వంతెన వద్ద గుర్రపుడెక్క మేటల్ని తొలగిస్తున్నారన్నారు. దీంతో నీటి ప్రవాహ వేగం పెరిగిందన్నారు. నివారణ చర్యలు సజావుగా సాగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు భయపడవలసిన అవసరం లేదని, ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.

ఇరిగేషన్ సహా ఇంజనీర్ వెంకటేశ్వరరావుకు జిల్లా కలెక్టర్ అభినందనలు…

ఉప్పుటేరును ఆనుకుని ఉన్న గ్రామాలు భారీ వరద ముంపుకు గురికాకుండా ముందస్తుగా మేల్కొని గత పది రోజులుగా ఉప్పుటేరులో కిక్కీస తొలగింపు పనులను ప్రారంభించి దబరాల ద్వారా తొలగింపు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ముందస్తు చర్యలు చేపట్టడంలో శ్రద్ధ వహించిన ఇరిగేషన్ సహాయం ఇంజనీర్ వెంకటేశ్వరరావును జిల్లా కలెక్టర్ శాలువా కప్పి ప్రత్యేకంగా అభినందించారు.

ఉప్పుటేరు పరిశీలన సందర్భంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ ఆస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా జలవనరుల శాఖ అధికారి పి.సుబ్రహ్మణ్యేశ్వర రావు, ఏఇ వెంకటేశ్వరరావు, ఆకివీడు తాహసిల్దార్ ఎన్.వెంకటేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

చినమల్లిపాడు మెడికల్ క్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..

ఉప్పుటేరు నీటి కారణంగా ముందస్తుగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువుల తల్లులను అవసరమైతే ముందస్తుగా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించాలని సూచించారు. అవసరమైన అన్ని మందులను నిల్వ ఉంచాలని, ముఖ్యంగా పాము కాటు మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

మెడికల్ క్యాంపును సందర్శించిన సందర్భంలో డిఎంహెచ్వో డాక్టర్ డి.మహేశ్వరరావు, పెదకాపవరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్ ఏఎన్ఎంలు, ఆశాలు, ఆకివీడు తాసిల్దార్ ఎన్ వెంకటేశ్వరరావు, తదితరులు ఉన్నారు.