ఉద్యోగులు మానసిక ఒత్తిడిని అధిగమించి విధులను మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు యోగ అభ్యసనం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

శనివారం భీమవరం కాస్మోపాలిటీ క్లబ్ ఆడిటోరియంలో ఈషా ఫౌండేషన్, భీమవరం వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు యోగ, ప్రాణాయం, మెడిటేషన్ పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉద్యోగులు ఎంతో ఒత్తిడికి గురి అవుతుంటారని, ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు యోగా చక్కటి మార్గం అన్నారు. ఆరోగ్యవంతమైన ఆహారం స్వీకరించలేకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడిని కలిగి ఉండటంతో షుగరు, బిపి, తదితర వ్యాధులతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారని, వీటిని జయించాలంటే తేలికగా ఇంటి వద్దనే యోగా అభ్యసనం చేస్తే అన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు.సద్గురు వాసుదేవ్ చే స్థాపించబడిన, లాభాపేక్షలేని, ఆధ్యాత్మిక సంస్థ ఇషా ఫౌండేషన్ అన్నారు. అన్ని ప్రాంతాల్లో ఈశా యోగా కేంద్రాలను నిర్వచించి ఎంతోమందికి మానసిక, శారీరక ఆరోగ్యమును పెంపొందించారన్నారు. ఇది యోగా మరియు ధ్యాన కార్యక్రమాలను అందిస్తుందని, ఇది వ్యక్తిగత అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుందన్నారు. ఇది గ్రామీణ పాఠశాలలకు ఉన్నత విద్యను అందిస్తుంది, వారి విద్య మరియు అభివృద్ధిని మెరుగుపరుస్తుందన్నారు. ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక నైపుణ్యాలను పెంపొందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం అన్నారు. యోగా వలన శారీరక శ్రమ, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి లంబార్ ప్రాంతాన్ని ఉత్తేజితం చేస్తుందని, వెన్నెముకతో పాటు కండరాలను కూడా బలోపేతం చేస్తుందన్నారు.
హైదరాబాద్ కి చెందిన ఏషాంగ్ రవి చంద్రారెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి యోగా వల్ల లభించే ప్రయోజనాల గురించి తెలియజేస్తూ, నేడు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అధిక ఒత్తిడికి వల్ల అనేక శారీరక, మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని యోగ, మెడిటేషనకు కేటాయిస్తే శారీరిక, మానసిక ఆరోగ్యంతో, సంతోషంతో జీవితం కొనసాగించవచ్చు అన్నారు. ఈ సందర్భంగా వివిధ యోగాసనాలు వేసే విధానాలను, ప్రాణాయం,నాడి శుద్ధి ప్రక్రియ విధానాలను డిజిటల్ స్క్రీన్ ద్వారా తెలియజేశారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, డీఈవో ఈ నారాయణ, డిపిఓ బి అరుణశ్రీ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, భీమవరం మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, భీమవరం ఇషా కోఆర్డినేటర్ మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ డి.విజయ, ఇషా వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.