ఉద్యోగులు తమ విధుల నిర్వహణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
భీమవరం డివిజనల్ స్థాయి గోదావరి క్రీడోత్సవాలు ప్రారంభం.
భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్.
స్నేహపూర్వక వాతావరణంలో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు.
శారీరక, మానసిక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి.
గోదావరి క్రీడోత్సవాలలో భాగంగా శనివారం ఎస్ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గోదావరి క్రీడోత్సవాలలో భాగంగా నేటి నుండి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఒకప్పుడు క్రీడా పోటీలు అంటే రెవిన్యూ, పోలీస్ శాఖలో మాత్రమే జరిగేవని, కానీ నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో ఈ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లావ్యాప్తంగా 3,500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. భీమవరం డివిజన్ పరిధిలో ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, నరసాపురం పరిధిలో వైఎన్ కళా శాల, తాడేపల్లిగూడెం పరిధిలో శశి కళాశాలలోను క్రీడలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రీడా పోటీలలో క్రికెట్, వాలీబాల్, షటిల్, చదరంగం, క్యారమ్స్, షాట్పుట్, టెన్నికాయిట్, త్రోబాల్ వంటి విభాగాల్లో మహిళలకు, పురుషులకు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడ పోటీల ద్వారా ఉద్యోగులలో ఒక స్నేహపూర్వక వాతావరణం, శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుందన్నారు. ఉద్యోగులు విధుల నిర్వహణలో వ్యక్తిగత ఆరోగ్యంపై అశ్రద్ధగా ఉంటారని, ఇటువంటి క్రీడా పోటీలలో పాల్గొనడం ద్వారా పని ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది అన్నారు. అధికారులు, ఉద్యోగులు తమ విధులు నిర్వహణతో పాటు ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలన్నారు.
జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గోదావరి క్రీడా సంబరాలు పేరిట మూడు డివిజన్లో క్రీడ పోటీలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పోటీలలో 35 శాఖలకు చెందిన 3,500 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొంటున్నారన్నారు. ఈ పోటీల ద్వారా ఉద్యోగులలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యంపై అవగాహన కలుగుతుందన్నారు. ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణం కలుగుతుందన్నారు. డివిజనల్ స్థాయి పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ముందుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులతో పరిచయం అనంతరం క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీలలో క్రీడాకారులతో కలసి ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డిఓ కె.రామచంద్రారెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎన్.మోహన్ దాస్, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, డీఈవో ఇ.నారాయణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏవి సూరిబాబు, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, తహసిల్దార్ రావి రాంబాబు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, క్రీడాకారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.