ఉచిత కృత్రిమ చేతుల అమరిక క్యాంపును అర్హులైన విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరం సమాచారం గోడపత్రికను సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు, వారి స్వావలంబన పెంపుకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్ మరియు ఎల్‌ఎన్-4 హ్యాండ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 2, 2026న గుంటూరులో మెగాకృత్రిమ చేతుల అమరిక శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మెగా క్యాంపులో చేతులు కోల్పోయిన అర్హులైన దివ్యాంగులకు సుమారు రూ.30,000 విలువైన అత్యాధునిక కృత్రిమ చేతులను పూర్తిగా ఉచితంగా అమర్చనున్నట్లు ఆమె పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అర్హులు ముందుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎల్‌ఎన్-4 హ్యాండ్స్ ద్వారా అందించబడే ఈ కృత్రిమ చేతులతో వ్రాయడం, పెయింటింగ్ చేయడం, తినడం, తాగడం వంటి రోజువారీ పనులతో పాటు సుమారు 4 కిలోల బరువును కూడా ఎత్తగల సామర్థ్యం ఉంటుందని తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దివ్యాంగులు మరింత ఆత్మవిశ్వాసంతో స్వతంత్ర జీవనం గడపడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతుల సామర్థ్యాలను పెంపొందించి, వారి జీవితాల్లో నూతన వెలుగులు పునరుద్ధరించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ మానవతా దృక్పథంతో ఈ సేవలను అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్ మరియు మరిన్ని వివరాల కోసం రెడ్ క్రాస్ భీమవరం కార్యాలయాన్ని లేదా మొబైల్ నంబర్ 79016 94488ను సంప్రదించాలని సూచించారు.
గోడపత్రిక ఆవిష్కరణలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బద్రిరాజు, వైస్ చైర్మన్ వి.కనకరాజు, కోశాధికారి కె.వి తిరుపతి రాజు, తదితరులు పాల్గొన్నారు.