ఉచిత ఇసుకను వినియోగదారునికి సరసమైన రవాణా చార్జీలతో అందించేందుకు టిప్పర్లు, లారీలు యజమానులు సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు .
సోమవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని టిప్పర్లు, లారీ ఓనర్స్ అసోసియేషన్స్ తో సమావేశమై ఉచిత ఇసుక రవాణా చార్జీలను సమీక్షించడమైనది. ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత ఇసుకను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో నూతన ఇసుక పాలసీని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఉచిత ఇసుకకు ఏ ఒక్కరికి రవాణా చార్జీలు భారం కాకూడదని, అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఛార్జీలతో వెసులుబాటు కల్పించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్నారు. జిల్లాలో ప్రస్తుతానికి ఇసుక అందుబాటులో లేదని, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా నుండి అందుబాటులో ఉన్న ఇసుకను పొందుటకు అవకాశం ఉందన్నారు. ఈరోజు సమీక్ష ద్వారా కిలోమీటర్ ఒక్కింటికి రవాణా చార్జీలను నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లాలో టిప్పర్, లారీ ఓనర్స్ ఈరోజు సమావేశంలో అంగీకరించిన చార్జీల వివరాలను ప్రభుత్వానికి ఆమోదము నిమిత్తం పంపడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. 18 టన్నుల కెపాసిటీ కలిగిన 10 టైర్లు లారీకి 40 కిలోమీటర్ల వరకు రూ.10/- లు, 40 కిలోమీటర్లు కిలోమీటర్లు పైబడి ప్రతి కిలోమీటర్ కు రూ.8/- చొప్పున, పది టన్నుల ఆరు టైర్ల లారీకి 40 కిలోమీటర్ల వరకు రూ.11/- లు, 40 కిలోమీటర్ల పైబడి కిలోమీటర్ ఒక్కింటికి రూ.8/- లు, నాలుగున్నర టన్నుల కెపాసిటీ కలిగిన ట్రాక్టర్ ట్రాలీకి 40 కిలోమీటర్ల వరకు రూ.15/-లు, 40 కిలోమీటర్ల పైబడి ప్రతి కిలో మీటర్ ఒక్కింటికి రూ.6/- లు చొప్పున సూచనప్రాయంగా రవాణా చార్జీలను నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు, జిల్లా రవాణా అధికారి పి.ఉమామహేశ్వరరావు, జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి జి.జయ ప్రసాద్, పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా టిప్పర్స్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రావోయి రాజా, పాలకొల్లు, భీమవరం, తదితర మండలాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.