ఈ నెల 19 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని అన్ని గ్రామాలలో జనవరి 19 నుండి ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
జనవరి 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా స్థిరమైన ఆదాయ వనరుగా పశుసంవర్ధన రంగం కొనసాగుచున్నదని, ఇది ఆ రంగంపై ఆధారపడిన వారికి ప్రధాన వనరుగా మారిందని తెలిపారు. జిల్లాలో చాలా కుటుంబాలు పశుసంవర్ధనపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 1,78,137 గేదెలు, 45,538 ఆవులు, 38,804 గొర్రెలు, 22,765 మేకలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు 2025 సంవత్సరంలో పశువుల ఆరోగ్య రక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నియంత్రణ, పశుపోషణ ఖర్చుల తగ్గింపు, శాస్త్రీయ పశుపోషణపై అవగాహన పెంచే లక్ష్యంతో జిల్లాలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరాల ద్వారా పశువులకు పశువైద్య సేవలు అందించడం జరిగిందని తెలిపారు. అదే స్పూర్తితో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా జిల్లాలోని అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహణకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ శిబిరాలలో ముఖ్యంగా పశువైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులకు చికిత్స, నట్టల నివారణ మందుల పంపిణీ (గొర్రెలు, మేకలకు సంవత్సరానికి 4 సార్లు, పెద్ద పశువులకు 2 సార్లు), వ్యాధి నిరోధక టీకాలు, పశువ్యాధుల నిర్ధారణ పరీక్షలు, శాస్త్రీయ పశు యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశుపోషకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది బాధ్యతాయుతంగా శిబిరాలను నిర్వహించి, పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.