Close

ఇరగవరం జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్

Publish Date : 09/07/2025

మధ్యాహ్న భోజన పథకం వంటశాల పరిశీలన

విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో పురోగతిని పెంచాలి హెచ్.ఎం కు ఆదేశాలు..

… జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

మండలంలోని ఇరగవరం జిల్లా పరిషత్ హై స్కూలును బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ స్కూలు ఆవరణ అంతా తిరిగి పరిశీలించారు. విద్యార్థులు అమ్మ పేరుతో నాటేందుకు సిద్ధపరిచిన మొక్కలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకంలో తయారు చేసే వంటశాలకు వెళ్లి వండిన వంటకాలను, స్టాక్ రూములో ఉన్న స్టాకును పరిశీలించారు. పరిశుభ్రమైన వాతావరణంలో సన్న బియ్యంతో రుచికరంగా వంట తయారు చేసి విద్యార్థులకు వడ్డించాలని ఎండిఎం వర్కర్లకు ఆదేశించారు. సన్న బియ్యంతో తయారు చేసిన మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, కూరలు రుచికరముగా ఉన్నాయా అని విద్యార్థులను అడుగుగా భోజనం బాగుంటుందని, కూరలు కూడా రుచికరంగా ఉంటున్నాయని విద్యార్థులు బదులివ్వడంతో జాయింట్ కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకు జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించారు. గత పదవ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణ శాతమును అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరము 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణ శాతంలో పురోగతిని సాధించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.
రేపు జరగబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీట్ కార్యక్రమం అత్యంత వైభవంగా పండుగ వాతావరణం లో నిర్వహించాలని హెచ్.ఎం, ఉపాధ్యాయులకు సూచించారు. హై స్కూల్ వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉండాలన్నారు. పేరెంట్స్, ప్రజా ప్రతినిధులు, పూర్వపు విద్యార్థులను పాఠశాల యాజమాన్యం విద్యార్థులు గౌరవంగా స్వాగతం పలకాలని అన్నారు. ప్రతి విద్యార్థి అమ్మ పేరుతో మొక్కను నాటి పోషించాలని అన్నారు. మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమంకు విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రభుత్వం అందజేసిన యూనిఫామ్, షూష్ ధరించి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యమును ఆదేశించారు. విద్యార్థులు ప్రగతిపై తల్లిదండ్రులతో చర్చించాలని అన్నారు. విద్యార్థులతో తొలి దైవం తల్లికి పాద పూజ చేసే కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ప్రతి విద్యార్థికి మెడికల్ టెస్ట్లు చేపించి నివేదికను తల్లిదండ్రులకు అందజేయాలని చెప్పారు. విద్యార్థులతో పాటు పేరెంట్స్ ప్రజా ప్రతినిధులకు సన్న బియ్యంతో తయారు చేసిన రుచికరమైన భోజన వసతి కల్పించాలని సూచించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమం లో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రధానోపాధ్యాయులను సిబ్బందిని ఆదేశించారు.

ఈ సందర్భంలో ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, తాహసిల్దార్ ఎం.సుందర్ రాజు, ప్రధానోపాధ్యాయులు గుణ్ణం నాగమణి, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.