Close

ఆర్థిక స్వాతంత్రం , స్వావలంబనే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు ప్రగతి పథంలో పయనించడం మహిళా శక్తికి నిదర్శనం…జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 10/03/2025

లింగ సమానత్వం, పురుషులతో సమానంగా వేతనం, గుర్తింపు, విలువ ఇవ్వాలన్నదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం

ఆర్థిక స్వాతంత్రం , స్వావలంబనే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు ప్రగతి పథంలో పయనించడం మహిళా శక్తికి నిదర్శనం

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

శనివారం స్థానిక కాస్మోపాలిటిన్ క్లబ్ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు మరియు ప్రజా పద్ధుల కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. తొలుత జ్యోతిని వెలిగించి, ప్రార్థనాగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం మాత్రమే కాకుండా చుట్టుపక్కల సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయన్నారు. మహిళలు తమ కష్టాలను, సమస్యలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలన్నారు. ఒకప్పుడు ఇంటికి పరిమితమైన మహిళ ఈరోజు విద్య, వైద్య, క్రీడ రంగాలకే పరిమితం కాకుండా అంతరిక్ష యానం చేసే స్థాయికి మహిళలు ఎదిగారని అన్నారు. స్వయం సహాయక సంఘాలను మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల కోసం ప్రవేశపెట్టిన గొప్ప వరం అన్నారు. మహిళలు స్వసక్తిగా ఎదిగేందుకు స్వయం సహాయక సంఘాల ఏర్పాటు వివిధ దేశాలు పరిశీలనాంశముగా నిలిచిందన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు పొదుపు చేసుకొని ఆర్థికంగా బలోపేతం అవ్వాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోని మహిళలు మరింత ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.

భీమవరం శాసనసభ్యులు మరియు ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ స్త్రీ లేకపోతే సృష్టి లేదని, ఈ సృష్టికి మూలం స్త్రీ అని, మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతామూర్తులు నడియాడతారన్నారు. ఏ కార్యమైనా చేయగల శక్తి స్త్రీకి మాత్రమే ఉందని, ప్రతి ఒక్కరు విజయం వెనుక స్త్రీ శక్తి ఉంటుందని అన్నారు. భారత రాష్ట్రపతిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళలను ఎంపిక చేసుకోవడం ఎంత గొప్ప విషయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని విధాల ప్రోత్సహిస్తూ ఆర్థికంగా బలపడేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

శాసనమండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి మాట్లాడుతూ దశాబ్దాల క్రితం మహిళలను పారిశ్రామిక రంగాలలో రోజుకు 18 గంటలు పని చేయించి శ్రమ దోపిడి జరిగేదని, మహిళలను హీనముగా చూసేవారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిందని, ఎంతోమంది మహిళలు తమ హక్కులు కొరకు అనేక ఉద్యమాల ద్వారా పోరాటం చేసి సాధించిన ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని పేర్కొన్నారు. ఇది మహిళ విజయముగా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందాని ఆయన అన్నారు.

రాష్ట్ర ఏపీ ఏఎస్ సిపిసి చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు మహిళలకు పురుషులతో పాటు ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాటిన డ్వాక్రా విత్తనం నేడు మహావృక్షమై కోటి మంది మహిళలు డ్వాక్రా మహిళా సంఘాలుగా ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు దీపం-2.0 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం అందిస్తుందని, త్వరలో ఉచిత బస్సు సర్వీస్, అమ్మకు వందనం వంటి పథకాలను మహిళలకు అందజేయడం జరుగుతుందని అన్నారు.

రాష్ట్ర ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ ఏ విషయంలోనూ మహిళలు తక్కువ కాదని, మన దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి పదవులతో పాటు జిల్లా కలెక్టర్ మరియు అనేక రంగాలలో మహిళలు అత్యున్నత పదవులను అధిరోహించి సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి మంది మహిళలు పొదుపు సంఘాలు ఏర్పడి అన్ని రంగాల్లో కుటుంబాలను ముందుకు నడుపుతున్నారని అన్నారు. ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామిక వేత్త రావాలని ప్రభుత్వం ఉద్దేశం అని ఆయన అన్నారు.

జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుణకుమారి, ట్రైనీ డి.ఎస్పి కె మానస, తదితరులు కార్యక్రమంలో ప్రసంగించారు.

ఈ కార్యక్రమం అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న మహిళా అధికారులకు, సిబ్బందికి, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ వర్కర్స్ సంబంధించిన వారిలో అత్యుత్తమ సేవలను అందించిన మహిళలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు చేతుల మీదుగా ఘనంగా సత్కరించి, మెమొంటోలను అందజేశారు.

స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజి రుణాలుగా రూ.40 కోట్లు, 701 మంది స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి రుణాలుగా రూ.95.59 కోట్లు, పి.ఎం విశ్వకర్మ పథకం కింద రూ.75 లక్షలు, సహాయ సహకార సంఘాలకు రూ.15 కోట్లు నమునా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

తొలుత భారతీయ విద్యా భవన్, విష్ణు కళాశాల విద్యార్థులుచే నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. నృత్య ప్రదర్శనలు, దేశ సేవలో మహోన్నత స్థానం పొందిన మదర్ తెరిసా, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, కిరణ్ బేడీ, కరణం మల్లేశ్వరి, మహానటి సావిత్రి, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, పి.టి.ఉష, డొక్కా సీతమ్మ వంటి మహిళా మణులును స్మరణకు తెచ్చేలా వస్త్రధారణతో విద్యార్థినుల ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి.

చివరిగా కాస్మో పాలిటిన్ క్లబ్ ఆడిటోరియం ఆవరణలో డిఆర్డిఏ, మెప్మా, ఐసిడిఎస్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రదర్శన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించి, ఆయా శాఖలను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఏఎస్పి భీమారావు, ఆర్డీవో కె .ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఐ సి డి ఎస్ పిడి బి.సుజాత రాణి, డి ఆర్ డి ఎ పిడి ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, డీఈవో ఇ.నారాయణ, ఎల్ డి ఎం ఏ.నాగేంద్రప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, డ్వాక్రా, మెప్మా మహిళలు, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

1.15.17.1