ఆరోగ్యవంతమైన బిడ్డలు కలిగేందుకు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుని, క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలి .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

ఏడవ పౌష్టికాహార పక్షోత్సవాలు సందర్భంగా బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరం నందు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా భీమవరం శాసనసభ్యులు, పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డలు బలంగా, ఆరోగ్యవంతంగా జన్మిస్తారన్నారు. ఆరోగ్యవంతమైన బావి పౌరులను అందించే బాధ్యత మీపై ఉందన్నారు.
స్త్రీ గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవం అయ్యే వరకు వైద్యుల సూచనలు మేరకు మందులు, బలవత్తరమైన ఆహారం తీసుకుంటేనే బిడ్డ పుట్టిన తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్యలు రావన్నారు.
ప్రతి గర్భిణీ స్త్రీ ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని డెలివరీ సమయం వరకు వైద్యుల సూచన మేరకు వైద్య పరీక్షలు చేయించుకుని దానికి అనుగుణంగా మందులు తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు బయట హోటల్స్ ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ వంటి తినుబండారాలు తినకూడదని స్పష్టం చేశారు. మీకు ఏమైనా తినాలనిపిస్తే ఇంటి వద్దనే తయారు చేసుకుని తినాలన్నారు. భావి భారత పౌరులను అందించే బాధ్యత తల్లులు పై ఉందన్నారు. ఎప్పుడైతే తల్లులు మంచి పోషకాహార తీసుకుంటారో పుట్టే పిల్లలు బలంగా పుడతారని, మెదడు పెరుగుదల చురుగ్గా ఉంటుందని, ఆప్పుడే తెలివైన పిల్లలు కలుగుతారన్నారు.
భీమవరం శాసనసభ్యులు మరియు పి ఎస్ సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో చక్కగా రాణించగలమన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు పాలు, ఆకుకూరలు తప్పక తీసుకోవాలన్నారు. పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం మొత్తం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేలా వైద్యాధికారులు సిబ్బంది వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు 15 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతల కార్యక్రమం నిర్వహించి, వివిధ రకాల ఫలాల కిట్ ను అందజేసి ఆశీర్వదించారు.
అనంతరం ఏడవ పౌష్టికాహార పక్షోత్సవ సమాచార గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పి ఏ సి చైర్మన్ మరియు స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అంగన్వాడిలు తయారు చేసిన గర్భిణీ స్త్రీలకు అందించే పౌష్టికాహారం పదార్థాలను జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు రుచి చూశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, జిల్లా వైద్య శాఖ అధికారి గీతాబాయి, సిడిపివోలు, ఐసిడిఎస్ సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.