ఆరేడు గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ తుఫాను ప్రభావం తగ్గేవరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ

Publish Date : 28/10/2026
WhatsApp Image 2026-10-28 at 5.50.01 PM

ఆర్నాబ్ తుఫాను ప్రభావం నేపథ్యంలో ఉండి మండలం ఆరేడు గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ బుధవారం సందర్శించి, బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
తుఫాను పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తాజా సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేయాలని స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
తుఫాను ప్రభావంతో కూలిన విద్యుత్ స్తంభాలను గుర్తించి, విద్యుత్ సరఫరాను సురక్షితంగా పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టే సమయంలో సిబ్బంది అన్ని ముందస్తు భద్రతా జాగ్రత్తలు పాటించాలని, ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ఆదేశించారు.