ఆడబిడ్డల సంరక్షణకు బాధ్యతాయుతమైన విధులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సఖి వన్ స్టాప్ సెంటర్ సెంట్రల్ ఎడ్మిన్ ఆదేశించారు.

మంగళవారం విస్సకోడేరు గ్రామంలోని సఖి వన్ స్టాప్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలోని కౌన్సిలింగ్ రూమ్, వసతి గదిని పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. సఖి సెంటర్ రిజిస్టర్లను, విజయ గాదలను పరిశీలించారు. సమాజంలో రోజురోజుకు మహిళలు, చిన్నారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, విధుల యందు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి వారికి బాసటగా నిలవాలన్నారు. బాధితులకు కౌన్సిలింగ్ జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. సఖి వన్ స్టాప్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని, ఎవరైనా బాధితులు టోల్ ఫ్రీ నెంబర్.181 కాల్ చేస్తే తక్షణ సహాయం అందుతుందని తెలిపారు. గృహహింస, యాసిడ్ దాడులు, బాలికల మిస్సింగ్, తాత్కాలిక వసతి, సైకో సోషల్ కౌన్సిలింగ్, మెడికల్ ఎయిడ్, లీగల్ ఎయిడ్, పోలీస్ ఎయిడ్ సేవలను అందించడం జరుగుతుందన్నారు. పోలీస్ ఎయిడ్ ద్వారా “జీరో” ఎఫ్ ఐ ఆర్ నమోదు అవకాశం ఉందని తెలిపారు.
ఈ సందర్భంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీలక్ష్మి, సఖి వన్ స్టాప్ సెంటర్ సెంట్రల్ ఎడ్మిన్ సిహెచ్.ధనలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేష్, తహసిల్దార్ ఎన్.విజయలక్ష్మి, ఎంపీడీవో వి.రెడ్డయ్య, గ్రామ సర్పంచ్ బి.శ్రీనివాస్, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.