Close

ఆడపిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని, స్వశక్తితో ఎదిగేందుకు చదువే మార్గమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 17/12/2024

మంగళవారం ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామంలోని జె.ఎన్.బి.ఎం జెడ్పి హై స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించారు. నేరుగా తరగతి గదిలోని విద్యార్థుల వద్దకు వెళ్లి వారి చదువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆడపిల్లలు స్వసక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. హై స్కూల్ స్థాయిలో 9,10 తరగతులు చాలా కీలకమని, మ్యాక్స్, ఫిజిక్స్, సైన్స్ సబ్జెక్టుల నందు మంచి పట్టు సాధించాలన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణత అనంతరం ఏ ఏ కోర్సుల్లో చేరితే ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయో ముందుగానే ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. చదువుతోపాటు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, ఇది జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎంతో తోడ్పడుతుందన్నారు. పదవ తరగతి తర్వాత పాలిటెక్నిక్, ఐటిఐ వంటి కోర్సులు అభ్యసించడం వలన త్వరితగతిన ఉద్యోగ అవకాశాలను పొందవచ్చునని సూచనప్రాయంగా తెలిపారు. అనంతరం క్రీడా మైదానాన్ని పరిశీలించి, మైదానం అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. హై స్కూల్ ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్ ను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారిని ఆదేశించారు. హై స్కూల్ ముందు భాగంలో ప్రహరీ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఆక్రమణలు ఏమైనా ఉంటే గుర్తించి వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజనంలో వడ్డించిన ఆహార పదార్థాలను ఆర్డీవో దాసిరాజుతో కలిసి ఉపాధ్యాయులు, అధికారులు, విలేకరుల సమక్షంలో రుచి చూసి, బాగున్నాయని తెలిపారు. పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాల నందే మధ్యాహ్నం భోజనం చేచేలా చూడాలని హెచ్ఎం కి తెలిపారు.

అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మెడికల్ అధికారిని వైద్య సేవలపై ఆరా తీశారు. పేద వర్గాల ప్రజలకు వైద్యం చేరువుగా ఉండేలా వైద్య సిబ్బంది ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. ఆసుపత్రుల నందు ప్రసవాలు పెంపుకు కృషి చేయాలన్నారు. ఆసుపత్రి నందు అన్ని వార్డులను పరిశీలించి గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సహాయంపై వారితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మిస్తారని తెలిపారు. అనంతరం అదే ఆవరణలో నిర్మాణంలో ఉన్న పిహెచ్సి భవనాన్ని పరిశీలించి తగుదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంలో ఆర్డిఓ దాసిరాజు, పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ ఏ.పూజ, ఎంఈఓ పి.రాజేంద్రప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు ఎన్.కృష్ణవేణి, సర్పంచ్ జక్కంశెట్టి చంటి, ఎంపీటీసీలు జి.లక్ష్మి, వి.పద్మ, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.