Close

ఆక్వా రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి ఎగుమతులకు అవసరమైన అనుమతులు తప్పనిసరిగా పొందాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 10/06/2026

ఆక్వా రైతులు సాగు మరియు ఎగుమతులకు సంబంధించిన అన్ని అనుమతులు, రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా పొందడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సాగు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మత్స్యశాఖ మరియు ఎంపెడా (MPEDA) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆక్వా రైతుల అవగాహన సదస్సులో బుధవారం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులకు ఫార్మ్ రిజిస్ట్రేషన్, ఎంపెడా ఫార్మ్ ఎన్రోల్మెంట్, నాణ్యమైన రొయ్య పిల్లల ఎంపిక, ఎగుమతుల ప్రమాణాలు, ట్రేసబిలిటీ విధానం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా రంగంలో రాష్ట్రంలోనే కీలక స్థానంలో ఉందని, ఈ గుర్తింపును మరింత బలోపేతం చేసేందుకు ప్రతి రైతు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఆక్వా సాగులో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా రొయ్యల సాగులో నిషేధిత మందులు, రసాయనాల వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ మరియు యూరప్ దేశాలకు ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తులపై కఠిన నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎగుమతులకు పంపే సరుకులో సుమారు 50 శాతం వరకు పరీక్షలు నిర్వహించిన అనంతరం మాత్రమే కొనుగోలు జరుగుతోందని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటించని పక్షంలో రైతులు మరియు ఎగుమతిదారులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 2029 జనవరి 10 నుండి ట్రేసబిలిటీ సర్టిఫికెట్ తప్పనిసరిగా అమల్లోకి రానుందని, ప్రతి రైతు ముందుగానే అవగాహన పెంచుకుని అవసరమైన రికార్డులు, నమోదులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఉత్పత్తి నుండి ఎగుమతి వరకు ప్రతి దశలో పారదర్శకత, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు మంచి నాణ్యమైన సీడ్‌ను ఎంపిక చేసుకోవాలని, సాగులో శాస్త్రీయ పద్ధతులు అనుసరించాలని తెలిపారు. అప్సడా (APSADA) రిజిస్ట్రేషన్ మరియు ఎంపెడా ఎన్రోల్మెంట్ ప్రతి ఆక్వా రైతు తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేశారు. పండించిన ఉత్పత్తులకు వ్యాల్యూ ఎడిషన్ మరియు ప్రాసెసింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత మంచి ధరలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో ప్రాసెసింగ్ నిర్వహించడం ద్వారా ఎగుమతుల అవకాశాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి డి.శ్రీనివాస్, ఎంపెడా డిప్యూటీ డైరెక్టర్ పి.ఆనంద్, టెక్నికల్ ఆఫీసర్ దుర్గారావు, ఎఫ్‌డీఓలు, ఎగుమతిదారులు, ఆక్వా రైతులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.