ఆక్వా జోన్ సర్వేలో నిబంధనలు కచ్చితంగా పాటించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి-జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో మంగళవారం మత్స్య, గృహ నిర్మాణ శాఖలపై ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మత్స్య, గృహ నిర్మాణ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వాజోన్ సర్వేలో నిబంధనలు కచ్చితంగా పాటించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. మండల్ లెవెల్ కమిటీ అధికారులు అందరూ ఆక్వా జోన్ లో ప్రతిపాదించిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సీవీడ్ సముద్రపు నాచు పెంపకం (సీవీడ్) పై ఎస్ హెచ్ జి గ్రూపులకు నిపుణుల చేత శిక్షణ ఇప్పించి ప్రోత్సహించాలని, ఈ కార్యక్రమాన్ని రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఆక్వాకు సంబంధించిన రైతులు, మత్స్యకారులు వివిధ భాగస్వాములు అందరిని విధిగా నమోదు చేయడం, దీని ఆవశ్యకతను అందరికీ తెలియజేయాలన్నారు. సముద్రపు నాచు పెంపకంలో ఇప్పటికే అభివృద్ధి సాధించిన తమిళనాడులోని మండపం మొదలైన ప్రదేశాలలో అధికారులు అధ్యయనం చేసి మన ప్రాంతంలో ఈ సాగుకు ప్రోత్సహించాలన్నారు. సమృద్ధిగా పండే వ్యవసాయ భూమిని ఆక్వా జూన్ లోకి ప్రతిపాదించవద్దని ఆయన అధికారులకు సూచించారు.
పిఎం ఆవాస్ యోజన గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి..
అనంతరం గృహ నిర్మాణ శాఖ ప్రగతిపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఇంచార్జ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ వారంలో 182 ఇళ్లకు స్లాబ్ పూర్తి చేయవలసి ఉండగా 52 ఇళ్లకు మాత్రమే స్లాబ్ లను వేయడం జరిగిందని, రాబోయే మూడు రోజుల్లో మిగిలిన 130 ఇళ్లకు స్లాబ్ లు పూర్తి చేయాలన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు విధిగా గృహాలను సందర్శించి సంబంధిత యాప్ లో నమోదు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కె.ఎస్.వి నాగలింగాచార్యులు, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, అభివృద్ధి అధికారులు, జిల్లా గృహ నిర్మాణశాఖ అధికారి జి.పిచ్చయ్య, డిఈలు, ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.