ఆక్వాజోనైజేషన్ నిర్ధారణలో నిబంధనల మేరకు పారదర్శకతతో కూడిన ప్రతిపాదనలను సిఫార్సు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు మత్స్య శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, ఉండి, ఆకివీడు, కాళ్ళ, భీమవరం, పెంటపాడు, గణపవరం మండలాల ఎఫ్ డి ఓ లు, ఎం ఏ ఓ లు తో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 19న నిర్వహించిన జిల్లా స్థాయి ఆక్వా జోనైజేషన్ ప్రకటన కమిటీలో ఆమోదించిన 31,307.4 ఎకరాల విస్తీర్ణంతో కలిపి ప్రస్తుతం జిల్లాలో 1,32,562.9 ఎకరాల ఆక్వా సాగు విస్తీర్ణం ఉందని తెలిపారు. ఆక్వా జోనైజేషన్ సర్వేలో వివిధ కారణాలతో తిరస్కరించిన 9,855.31 ఎకరాల విస్తీర్ణంపై జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సోమవారం పునః పరిశీలన చేయడం జరిగింది. వీటిలో మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే తదుపరి జరిగే జిల్లాస్థాయి ఆక్వా జోనైజేషన్ ప్రకటన కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
ఈ సమావేశంలో మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఆర్. వి.ఎస్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఉండి, ఆకివీడు, కాళ్ళ, భీమవరం, పెంటపాడు, గణపవరం మండలాల ఎఫ్ డి ఓ లు, ఎం ఏ ఓ లు పాల్గొన్నారు.