Close

ఆక్వాజోనైజేషన్ నిర్ణయంలో కచ్చితత్వంతో కూడిన ప్రతిపాదనలను సిఫార్సు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత కమిటీలను ఆదేశించారు.

Publish Date : 19/09/2025

శుక్రవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆక్వా జోనైజేషన్ ప్రకటన కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామ, మండల కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్వా జోనైజేషన్ కు ప్రతిపాదించిన నివేదికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి మార్పులు, చేర్పులు, తిరస్కరణకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 1,07,635.7 ఎకరాలలో ఆక్వా విస్తీర్ణం ఉందని, దీనికి అదనంగా 24,927.16 ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్వా జోనైజేషన్ సర్వే ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో 1,32,562.9 ఎకరాల ఆక్వా సాగు విస్తీర్ణం ఉందని తెలిపారు.

ప్రస్తుతం చేపట్టిన ఆక్వా జోనైజేషన్ సర్వేలో 24,927.16 ఎకరాలను, దీనికి అదనంగా సాగుకు పనికిరాని, లోతట్టు ప్రాంతంలో ఉన్న, నీటి ముంపు గురవుతున్న సాగు భూములలోని 6,379.97 ఎకరాలను ఆక్వా జోనైజేషన్ సర్వేలో గుర్తించడం జరిగిందని తెలిపారు. సర్వేలో గుర్తించిన మొత్తం 31,307.13 ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్వా జోనైజేషన్ గా ప్రకటించడానికి జిల్లావ్యాప్తంగా 250 గ్రామ సభలను ఏర్పాటుచేసి ఆమోదించడం జరిగిందన్నారు. గ్రామ, మండల కమిటీల ప్రతిపాదనలను, గ్రామసభల ఆమోదంతో జిల్లా కమిటీ ముందు ఉంచిన 31,307.14 ఎకరాల విస్తీర్ణాన్ని నేడు నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదిస్తూ ప్రకటించడం జరిగిందన్నారు. ఈ ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీకి సిఫారసు చేస్తూ పంపడం జరుగుతుందని తెలిపారు. ఇవే కాకుండా జిల్లాలో 9,855.31 ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్వా జోనైజేషన్ సర్వేలో కమిటీ సభ్యులు వివిధ కారణాలతో తిరస్కరించడం జరిగిందని తెలిపారు. వీటిని తిరిగి గ్రామ, మండల కమిటీలు పునఃపరిశీలన చేసి మార్పులు, చేర్పులను జిల్లా స్థాయి కమిటీ ముందు ఉంచడానికి మరో అవకాశాన్ని ఇవ్వడానికి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, కమిటీ కన్వీనర్ మరియు మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ ఎ.నాగరాజు, గణపవరం, నరసాపురం, భీమవరం – 1, 2 మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఆర్ వి ఎస్ ప్రసాద్, ఎల్ ఎల్ ఎన్ రాజు, సిహెచ్ రాంబాబు, ఎన్ వెంకటేశ్వరరావు, జిల్లాస్థాయి కమిటీ సభ్యులు మరియు రైతులు పి.వి రామరాజు, తులసి రాంబాబు, కె.కృష్ణం రాజు, ఆక్వా కల్చర్ ఫార్మర్స్ ప్రతినిధి సుబ్బరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా అటవీ శాఖ అధికారి ఆశ కిరణ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి వెంకటేశ్వరరావు, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులు, ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.