ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని, పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
శనివారం ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు జ్యోతిని వెలిగించి, పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దేశం కోసం, రాష్ట్రం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుడన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన కృషిని మరువలేనిది అన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆగస్టు 23, 1872న మద్రాస్ ప్రెసిడెన్సీలోని వినోదరాయునిపాలెంలో జన్మించారన్నారు. బాల్యంలో ఎన్నో కష్టాలు పడి విద్యనభ్యసించారన్నారు. న్యాయవాద వృత్తిపై మక్కువతో ఇంగ్లాండ్లో బారిష్టర్ పూర్తిచేసి మద్రాస్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి ప్రముఖ న్యాయవాదిగా పేరుపొందారున్నారు. అనంతరం న్యాయవాద వృత్తిని వదిలి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని అనేక ఉద్యమాలు చేపట్టారన్నారు. సైమన్ కమిషన్ వ్యతిరేక నిరసనల సమయంలో బ్రిటిష్ సైనికులకు తన గుండెను చూపించి కాల్చుకోమని తన నిర్భయతను ప్రదర్శించినందుకు ప్రకాశం పంతులుగారు ఆంధ్ర కేసరిగా బిరుదును పొందారన్నారు. ప్రకాశం పంతులు క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి వివిధ ఉద్యమాలలో పాల్గొని తన ధైర్యసాహసాలను, నిబద్ధతను ప్రదర్శించారన్నారు. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులలో ఆ రోజులలో పట్టుదలతో విద్యనభ్యసించి ఎంతో ఎత్తుకు ఎదిగిన కార్యదీక్షపరుడన్నారు. నేటి యువత టంగుటూరు ప్రకాశం పంతులు పోరాటపట్టి మను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకి చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా సాంఘిక పాఠశాలల విద్యార్థులు ఏ.సంజనా దేవి, ఎన్.ఏసు, వై జ్యోయసి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గురించి చేసిన ప్రసంగంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులను అభినందించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు, వసతి గృహ వార్డెన్లు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.