అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తప్పక నమోదు చేయించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
బి ఎల్ ఓ లు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలి
జూలై 14 లోపుగా 95% పైబడి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతగా పూర్తి చేయాలి
భీమవరం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాల్ నందు మంగళవారం భీమవరం నియోజకవర్గం ఓటర్ల జాబితా సవరణపై (సర్ ) బిఎల్ఓ లకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలింగ్ స్టేషన్ వారిగా భీమవరం, వీరవాసరం మండలాలకు నియమించిన బిఎల్ఓ లతో మ్యాపింగ్ పై సమీక్షించారు. భీమవరం అర్బన్ మండలంలో 55.54 శాతం, రూరల్ లో 63 శాతం, వీరవాసరం మండలంలో 64 శాతం, మొత్తం నియోజకవర్గ పరిధిలో 59.98 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది అన్నారు. ఇంకా సుమారు 40 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని, వేరే ప్రాంతాలకు మారిన, ఇతరత్రా కారణాలతో ఆ నివాసంలో లేకపోతే విచారించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అలాగే కొన్ని పోలింగ్ స్టేషన్లు పరిధిలో బిఎల్ఓ లు 95% పైబడి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయడాన్ని పరిశీలించి వారిని అభినందిస్తూ, ఆ బిఎల్ఓ లను ఆదర్శంగా తీసుకుని మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి అన్నారు. జవాబుదారీతనంతో పనిచేయాలని, అంకితభావంతో పనిచేస్తే సాధ్యం కానిది ఏమీ లేదని హితవు పలికారు. బూత్ లెవల్ అధికారులు (BLOలు) తమ విధులను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని, 2002 ఓటర్ల జాబితా మరియు 2025 తాజా జాబితాలను ఆధారంగా తీసుకుని మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటింటి సర్వేలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, అవసరమైన ఫారం-6, ఫారం-7, ఫారం-8 తదితర దరఖాస్తు పత్రాలను బిఎల్వోలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా వెయ్యి మంది ఓటర్లకు మాత్రమే పరిమితం ఉండేలా నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ చేపట్టాలని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం షెడ్యూల్‌ను వివరిస్తూ, జూన్ 5 నుండి 14 వరకు శిక్షణ మరియు ప్రింటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 15 నుండి జూలై 14 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని చెప్పారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించబడుతుందని, జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఓటరు నమోదుకు సంబంధించి అవసరమైన పత్రాలపై కూడా కలెక్టర్ వివరణ ఇచ్చారు. 01.07.1987కు ముందు జన్మించినవారు, 01.07.1987 నుండి 02.12.2004 మధ్య జన్మించినవారు, అలాగే 02.12.2004 తర్వాత జన్మించినవారికి వేర్వేరు ధృవపత్రాలు అవసరమవుతాయని తెలిపారు. జనన ధృవపత్రం, విద్యా ధృవపత్రాలు, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డులు తదితర పత్రాలను వినియోగించవచ్చు అన్నారు. ఇంటింటి సర్వే ద్వారా డూప్లికేట్ ఓటర్లు, మరణించినవారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను సేకరించి జాబితా శుద్ధి చేపడతామని తెలిపారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న యువత, మహిళలు, దివ్యాంగులు, వలస కార్మికులు వంటి వర్గాల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జూన్ 15 నుండి జూలై 14 వరకు బూత్ లెవల్ అధికారులు నిర్వహించనున్న ఇంటింటి సర్వేకు సంబంధించిన కిట్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సమావేశంలో భీమవరం ఆర్డీవో మరియు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం మున్సిపాలిటీ సహాయ కమిషనర్ ఏ రాంబాబు, తహసిల్దార్లు రావి రాంబాబు, రామాంజనేయులు, బి ఎల్ వోలు, తదితరులు పాల్గొన్నారు.