అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేయడం జరుగుతుందని, ఇటీవల రద్దు చేసిన పింఛన్ దారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భుగర్భ జలాలు, పియం కుసుమ్ పధకానికి భూ సంబంధిత అంశాలు, పింఛన్లు, జిల్లా జువెనైల్ జస్టీస్ కమిటీల ఏర్పాటు వాటి అమలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హతగల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఫించన్ అందించాలని ఎక్కడైనా అర్హత ఉండి ఫించన్ రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ముందుగా పింఛన్లు పంపిణీపై సిఎస్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని కలెక్టర్లుకు స్పష్టం చేశారు. ప్రతినెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా, మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అర్హత గలవారందరికీ తప్పనిసరిగా ఫించన్ అందేలా చూడలాని అర్హత ఉన్నా ఫించన్ రాలేదని మీడియా, సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలక్టర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు. పెన్షన్ల తనిఖీకి సంబంధించి లక్షా 35 వేల మందికి నోటీసులు జారీ చేసి నెలరోజుల్లోగా ఎంపిడిఓలకు అప్పీళ్ చేసుకోవాలని తెలియజేయాగా వారిలో 88వేల 319 మంది ఎంపిడిఓలకు అప్పీలు చేసుకోగా ఇంకా 23వేల మంది అప్పీలు చేసుకోలేదని నెలరోజుల గడువులోపు అప్పీళ్ళన్నీ పరిష్కరించాలని కలక్టర్లను సిఎస్ ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై ఎక్కడా నెగిటివ్ ప్రసారం రాకుండా చూసుకోవాలని అర్హతగల వారందరికీ తప్పనిసరిగా ఫెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.అంతకు ముందు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భూగర్భ జలాల పెంపు,పియం కుసుమ్ ఫధకానికి సంబంధించి భూసంబంధిత అంశాలు,జిల్లా జువనైల్ జస్టీస్ కమిటీలు ఏర్పాటు,యూరియా లభ్యత తదితర అంశాలపై కలక్టర్లతో సిఎస్ సమీక్షించారు.
ఈసమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి..రాహుల్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.