అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలి.అత్యవసర మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలి….
సోమవారం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో పశ్చిమగోదావరి జిల్లా తుఫాను సహాయక చర్యల ప్రత్యేక అధికారి ఎం.ఎం. నాయక్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక, పునరుద్ధరణ చర్యలు, ప్రజలకు అందిస్తున్న అత్యవసర సేవలు, పంట నష్టాల అంచనాలపై సమీక్షించారు.
అర్నబ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం తదితర అత్యవసర మౌలిక సదుపాయాలను తక్షణమే పునరుద్ధరించాలని, మరమ్మతు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తాత్కాలిక పునరుద్ధరణ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని ఈ నెలలోనే పంపిణీ చేయాలని, వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టాన్ని ఈ నెల 6వ తేదీలోగా పూర్తిస్థాయిలో అంచనా వేసి సమగ్ర నివేదిక అందించాలని సూచించారు.
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు అందుబాటులో ఉండి, శాఖల మధ్య సమన్వయంతో సహాయక, పునరుద్ధరణ చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, డిఆర్ఓ పి. గ్లోరియా, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు