Close

అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధవహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

Publish Date : 17/03/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డ్వామా పిడి డా.కె.సి.హెచ్. అప్పారావు, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి.శివరామ ప్రసాద్, సంయుక్తంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలు పరిశీలించి నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పి జి ఆర్ ఎస్ ద్వారా వచ్చే అర్జీలను సమర్థవంతంగా పరిష్కరించి ప్రభుత్వం ఐ వి ఆర్ ఎస్ ద్వారా సమాచార సేకరణ అనంతరం ప్రకటించే ర్యాంకుల్లో జిల్లా మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలన్నారు. “స్వర్ణాంధ్ర- స్వచ్ఛ దివాస్” కార్యక్రమంలో భాగంగా గత శనివారం ముఖ్యమంత్రి తణుకు పర్యటన కార్యక్రమాన్ని అధికారులు అందరూ ఎంతో కష్టపడి పనిచేసి విజయవంతం చేశారన్నారు. అక్టోబర్, 2 తర్వాత ముఖ్యమంత్రి జిల్లాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారని ఈ లోపు గానే పశ్చిమగోదావరి జిల్లాను అత్యంత పరిశుభ్రత జిల్లాగా సిద్ధం చేసేందుకు అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఈ రోజు ప్రజల నుండి అందిన 271 దరఖాస్తులలో ముఖ్యంగా….

@భీమవరం పట్టణానికి చెందిన తిరుమణి నాగరాణి తాను అద్దె ఇంటిలో నివాసముంటున్నానని, పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నాని నాకు టిడ్కో ఇల్లు గాని, ఇంటి స్థలం గాని ఇప్పించాలని అర్జీలో కోరారు.

@గణపవరం మండలం సరిపల్లె గ్రామానికి చెందిన నంద్యాల రామలింగరాజు అర్జీని అందజేస్తూ చినరామచంద్రపురం పరిధిలో ప్రభుత్వ భూమి కబ్జా చేసి అందులో భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపం నిర్మించి ఆదాయం పొందుతున్నారని, అన్యాక్రాంతమైన భూమి గణపవరం పంచాయతీకి అప్పగించాలని కోరారు.

@మొగల్తూరు మండలం కొత్తోట గ్రామానికి చెందిన కొప్పనాతి ఏడుకొండలు అర్జీనిస్తూ దిగమర్రు – లోసరి రోడ్డు విస్తరణలో మా భూమిని తీసుకున్నారని దానికి నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.

@అత్తిలి మండలం బల్లిపాడుకు చెందిన భాషాబత్తుల శ్రీనివాస్ తనకున్న 62 సెంట్లు భూమి ఆన్లైన్ లో కనిపించడం లేదని, నా పేరు మీద సంబంధిత భూమి ఆన్లైన్ లో నమోదు చేయాలని కోరారు.

@కాళ్ళ మండలం వేంపాడు గ్రామానికి చెందిన దాసరి సువర్ణ ఆర్జినిస్తూ నా అల్లుడు కూతురు నా సొంత ఇంటి దస్తావేజులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా అడిగితే నాపై దౌర్జన్యం చేస్తున్నారని, దయచేసి నా ఇంటి దస్తావేజులు ఇప్పించాలని కోరారు.

@అత్తిలి మండలం స్కిన్నేరపురం గ్రామానికి చెందిన అందే సుబ్రహ్మణ్యం అర్జీనిస్తూ పంచాయతీకి సంబంధించిన 21 సెంట్లు భూమి కబ్జాకు గురైందని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ స్థలాన్ని తిరిగి పంచాయతీకి అప్పగించాలని కోరారు.

@అత్తిలి మండలం స్కిన్నేరపురం గ్రామానికి చెందిన ఆకుమర్తి సత్యనారాయణ అర్జీని ఇస్తూ ప్రస్తుతం ఉన్న గ్రామంలో ఉన్న స్మశాన వాటిక అవసరాలకు సరిపోవడం లేదని, స్మశాన వాటికకు అదనపు స్థలం కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డ్వామా పిడి డా.కె.సి.హెచ్. అప్పారావు, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి.శివరామ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.