అర్జీలు రీఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి–జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.
పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారం పారదర్శకత, నాణ్యతతో ఉండాలి.
ఫిర్యాదుదారులతో మాట్లాడి నిర్ణీత గడువులోపున పరిష్కారం చూపాలి.
సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, పి జి ఆర్ ఎస్ వై.దోసి రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి. ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేసి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కొక్క సందర్భంలో ఫిర్యాదులు పరిష్కారానికి కొంత సమయం అవసరం ఉన్నప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదుదారులతో అధికారులు మాట్లాడాలన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబందిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా సమస్యల పరిష్కారం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
ఈరోజు పీజీఆర్ఎస్ కి అందిన దరఖాస్తులలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.
@. కాళ్ల మండలం జక్రం గ్రామానికి చెందిన కల్లేపల్లి చంటి రాజు అర్జీని సమర్పిస్తూ, తాను, నా భార్య కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని, తాను వృద్ధాప్య పింఛనుకు దరఖాస్తు చేసుకున్నప్పటికి మంజూరు కాలేదని, వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
@. తాడేపల్లిగూడెంకు చెందిన వెలుగుర్తి పద్మ అర్జీని సమర్పిస్తూ, తన భర్త సూర్యారావు మొదటి భార్య కొడుకు వెలుగుర్తి వెంకటరావు తనను మోసం చేసి నా పేరు మీద ఉన్న ఇంటిని రాయించుకుని తనను బయట గెంటి వేశాడని తన ఇల్లు తనకు ఇప్పించాలని కోరారు.
@. అత్తిలి కి చెందిన వి.నాగమణి అర్జీని సమర్పిస్తూ, తనకు 33 సెంట్లు భూమి ఉందని రిసర్వేలో 31 సెంట్లు మాత్రమే చూపిస్తున్నదని, 2 సెంట్లు భూమి తగ్గిందని తిరిగి సర్వే చేసి తనకు రావలసిన రెండు సెంట్లు భూమి ఇప్పించాలని కోరారు.
@. ఎల్.ఎన్ పురం గ్రామానికి చెందిన ఎడవల్లి పెద్దులు అర్జీని సమర్పిస్తూ, గత సంవత్సరం అనారోగ్య కారణంగా తన ఎడమ కాలు క్రింది భాగం పూర్తిగా తొలగించారని, ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నానని, తను, తన భార్య ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని తనకు వికలాంగు పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
@. అత్తిలి మండలం అత్తిలి శివారు బొండవారి పాలెం కు చెందిన వైట్ల సూర్య వేణి అర్జీని సమర్పిస్తూ, తనకు వారసత్వంగా రెండు ఎకరాలు భూమి వచ్చిందని రీ సర్వేలో 1 ఎకరం 94 సెంట్లు మాత్రమే చూపిస్తున్నదని, రీ సర్వే చేసి తనకు రావలసిన 6 సెంట్లు భూమి ఇప్పించాలని కోరారు.
@. ఆకివీడు మండలం, ఆకివీడుకు చెందిన కోకరాల నీలవేణి అర్జీని సమర్థిస్తూ, తన భర్త 2019లో మరణించారని ఇప్పటివరకు ఎటువంటి పింఛను మంజూరు కాలేదని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా నని తనకు వితంతు పింఛను మంజూరు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిపునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.