అర్జీదారుల ఫిర్యాదుల పరిష్కారం వారు సంతృప్తి చెందే విధంగా చూపాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డాక్టర్ కే సి హెచ్ అప్పారావు, కలెక్టరేట్ ఏవో ఎన్.వెంకటేశ్వరావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువు లోపుగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారులు సంతృప్తిచెందేలా సమస్యలను పరిష్కరించినపుడే ప్రభుత్వ అధికారులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఏ విధంగా జరిగిందో ఐ వి ఆర్ ఎస్ ద్వారా ఫిర్యాదుదారులతో మాట్లాడిన సందర్భంలో లబ్ధిదారులు స్పందన సంతృప్తికరంగా లేదని వ్యక్తం చేయడం జరిగిందన్నారు. కావున అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యల పరిష్కారంలో లబ్ధిదారులు సంతృప్తి పడే విధంగా పరిష్కరించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రగతి మన జిల్లా దిగువ స్థానంలో ఉందని, అధికారులు బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంతో పనిచేసి మన జల్లాను మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు ఎంతో కష్టపడి క్షేత్రస్థాయిలో అమలు చేయడం జరుగుతోందని సంబంధిత కార్యక్రమాలను వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీపై ఉందన్నారు. మీరు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను, సమాచారాన్ని మీడియా ప్రతినిధులకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 162 ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. వాటిలో కొన్ని అర్జీలు ఈ విధంగా ఉన్నాయి.
@ పెంటపాడు మండలం ముదునూరు గ్రామానికి చెందిన కొత్త బాలమణి అర్జీ సమర్పిస్తూ తాను పుట్టుకతో అందురాలునని ప్రస్తుతం 6 వేల రూపాయలు పెన్షన్ పొందుతున్నానని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా 15 వేల రూపాయల పెన్షన్ మంజూరు చేస్తూ రేషన్ కార్డుపై 30 కేజీలు బియ్యం ఇప్పించాలని కోరారు.
@ ఆచంట మండలం, శేషమ్మ చెరువుకు చెందిన మనే సుభద్ర అర్జీ సమర్పిస్తూ, తన వ్యవసాయ భూమి సరిహద్దు రైతులు రొయ్యలు చెరువు సాగు ద్వారా నా పంట భూమికి నష్టం జరుగుతోందని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
@ అత్తిలి మండలం, అత్తిలి గ్రామానికి చెందిన మధ్యాహ్నపు జ్యోతి అర్జీ సమర్పిస్తూ, తన భర్త 2024 లో చనిపోయారని, కుటుంబ పోషణ కష్టంగా ఉందని ఆర్థికంగా పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దయచేసి వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
@ పాలకొల్లు మండలం వెలివెలి పెదపేటకు చెందిన పిడకల నాగరాజు అర్జీని సమర్పిస్తూ, మా గ్రామంలో లంకపల్లి కొండయ్యకు చెందిన 53 సెంట్లు, పెదపేటలో 2.62 సెంట్లులలో అనధికార లేఔట్ వేసి అమ్ముతున్నారని ఈ విషయంపై వీఆర్వో, సర్పంచులకు పలుమార్లు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని ఈ అనధికార లేఔట్ లపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
@ భీమవరం మండలం అనా కోడేరు శివారు పల్లెపాలెం చెందిన దుర్గా భవాని అర్జీని సమర్పిస్తూ, తాను పిడబ్ల్యూడి పోరంబోకు స్థలంలో రేకుల షెడ్డు వేసుకొని పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్నానని అధికారులు తక్షణమే ఇల్లు ఖాళీ చేయమంటున్నారని తనకు ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరారు.
@ ఆకివీడు మండలం, ఆకివీడు గ్రామానికి చెందిన కొటికలపూడి సత్యనారాయణ అర్జీ సమర్పిస్తూ, గాంధీనగర్ 2వ వీధిలో రోడ్డుపైకి అదనపు నిర్మాణాలు కడుతున్నారని, రోడ్డు చాలా ఇరుకుగా ఉందని సర్వే చేయించి రోడ్డు ప్రక్కన ఆక్రమణలు తొలగించాలని కోరారు.
@ ఇరగవరం మండలం కావలిపురం గ్రామానికి చెందిన దో మ్మిశెట్టి లక్ష్మి తాను బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నానని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని వికలాంగు పింఛన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.
ఈ సమావేశంలో వివిధ శాఖ జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమం ట్రిబునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
