Close

అర్జీదారుల ఫిర్యాదులు నిర్దేశించిన గడువులోగా వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి,

Publish Date : 08/12/2025

పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడి డా.కెసిహెచ్ అప్పారావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకటేశ్వర రావు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈరోజు నిర్వహించిన పి జి ఆర్ ఎస్ సమావేశంలో వివిధ సమస్యల పరిష్కారానికై ప్రజలు మెత్తం 198 అర్జీలను సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువు లోపుగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. తమ శాఖ పరిధిలో లేని ఫిర్యాదులు వస్తే వాటిని తక్షణమే సంబంధిత శాఖ అధికారులకు పంపించాలన్నారు. అర్జీదారులు సంతృప్తిచెందేలా సమస్యల పరిష్కారం ఉండాలన్నారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు.

ఈ రోజు అందిన అర్జీలలో కొన్ని పిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి.

@ పెనుమంట్ర మండలం, నత్తరామేశ్వరం గ్రామానికి చెందిన వెలగల రత్నకుమారి అర్జీ సమర్పిస్తూ, తనకు 150 సెంట్లు భూమి ఉన్నదని, తాను విదేశాలలో ఉన్న సమయంలో సరిహద్దు వారు నా భూమిని ఆక్రమించుకున్నారని, నా పొలములో వ్యవసాయ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకుని తన భూమిని ఇప్పించాలని ఫిర్యాదు చేశారు.

@ అత్తిలి మండలం, ఈడూరు గ్రామం నుండి తలారి గంగమ్మ పిర్యాదు చేస్తూ, ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ కాలనీలో గృహం నిర్మించుకుని నా భర్త నేను ఉంటున్నామని, ఇల్లు తప్ప మరి ఏఇతర ఆదాయము లేదని, ఇటీవల నాకు హార్ట్ సర్జరీ జరిగిదని, ఎటువంటి ప్రభుత్వ పథకము రావడం లేదని, ప్రభుత్వ పథకములకు అర్హత కలిగేలా చూడాలన్నారు.

@ పాలకొల్లు మండలం, పూలపల్లి గ్రామం నుండి ఈద కీర్తన అర్జీ సమర్పిస్తూ, తన భర్త నా నుండి విడాకులు తీసుకున్నారని, నాకు 5, 7 సంవత్సరములు ఇద్దరు ఆడపిల్లలని, నా పిల్లలను నాతో మాట్లాడనివ్వకుండా నిర్బంధముచేసి, నాకు చెందిన ఆభరణాలు వస్తువులు తన దగ్గరే ఉంచుకుని ఇవ్వడం లేదని, వారిపై చర్యలు తీసుకుని తన బిడ్డలను తన వద్దకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

@ పెంటపాడు మండలం, అల్లంపురం గ్రామానికి చెందిన పారిచర్ల మాధవి అర్జీ సమర్పిస్తూ, నాకు 48 సెంట్లు భూమి ఉన్నదని,ఇటీవల డ్రోన్ సర్వే నిర్వహించగా 43 సెంట్లు మాత్రమే ఉన్నదని, పక్క భూమిలో 5 సెంట్లు భూమి చూపిస్తున్నదని, కొలతలు కొలిపించి పాస్ పుస్తకం ప్రకారం భూమి సరిహద్దులు చూపించాలని కోరారు.

@ భీమవరం మండలం, దిరుసుమర్రు గ్రామానికి చెందిన భోగి శెట్టి వెంకటేశ్వరరావు అర్జీ సమర్పిస్తూ, తనకు రెండు కళ్ళు కనిపించవని, 40 శాతం వికలాంగ ధ్రువీకరణ పత్రం ఉందని వికలాంగు పింఛన్ మంజూరు చేయాలని కోరారు.

@ తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఎస్.సుధారాణి ఇంటి స్థలం ఇప్పించాలని అర్జీ సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖ జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమం ట్రిబునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.