అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
నేడు పి జి ఆర్ ఎస్ లో 240 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 67 దరఖాస్తులు స్వీకరణ.
జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ బి.శివన్నారాయణరెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులకు నేరుగా తమ సమస్యలను విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. కొన్ని ప్రధాన సమస్యలపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నేరుగా ఆర్డీవోలు, తహసిల్దార్లతో వెబ్ఎక్స్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నేడు భూ సంబంధిత సమస్యలు, కొత్తగా వికలాంగ, వితంతు పెన్షన్లు, గృహ నిర్మాణం, ఇల్లు మంజూరు, సీనియర్ సిటిజన్స్ సమస్యలు, ఆరోగ్య అంశాలకు సంబంధించిన వివిధ సమస్యలపై ప్రజల నుండి పలు ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.
ఈ రోజు అందిన అర్జీలలో కొన్ని పిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి.
@ పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామానికి చెందిన పడాల గోపాలరెడ్డి అర్జీ సమర్పిస్తూ, తనకు దస్తావేజు ప్రకారం 44 సెంట్లు పట్టాదార్ పాస్ పుస్తకంలో నమోదయిందని కానీ ఆన్లైన్లో 37 సెంట్లు మాత్రమే చూపిస్తున్నదని సరిచేసి తగ్గిన ఏడు సెంట్లు ఇప్పించాలని దరఖాస్తులో పేర్కొన్నారు.
@ వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన కొడమంచిలి సువార్త దివ్యాంగురాలు దివ్యాంగుల పెన్షన్ మంజూరు కొరకు సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని కోరారు.
@ భీమవరం మున్సిపాలిటీ, గునుపూడికి చెందిన కమ్మిలి జ్యోతి, అత్తిలి మండలం కంచుమర్రు గ్రామానికి చెందిన సుబ్బు వెంకటరమణ, వితంతు పెన్షన్ మంజూరు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
@ అత్తిలి గ్రామానికి చెందిన మల్ల సూర్య ప్రకాశరావు అర్జీని సమర్పిస్తూ, తన కుమారులు తనను ఇంటి నుండి బయటకు గెంటివేశారని, విచారించి తనకు తగు న్యాయం చేయాలని కోరారు.
@ కాళ్ళ మండలం, సీసలి గ్రామానికి చెందిన నాగమణి అర్జీ సమర్పిస్తూ, తన భర్త అనారోగ్య కారణంగా మరణించారని,తాను మూడు నెలలు పింఛను తీసుకోలేదని ఆ కారణంగా తనకు పింఛను నిలిపివేశారని, దయచేసి తనకు వితంతు పించను పునరుద్ధరించాలని కోరారు.
@ భీమవరం మండలం, తాడేరు గ్రామానికి చెందిన గంట రాజేష్ వారి అమ్మగారికి అనారోగ్య కారణాల దృష్ట్యా రెండు కాళ్లు తొలగించారని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని, వారి అమ్మగారికి ఒక వీల్ చైర్, వికలాంగత్వ శాతాన్ని పెంచి వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.
@ పాలకోడేరు మండలం, గరగపర్రు గ్రామానికి చెందిన బేతా నాగమణి అర్జీ సమర్థిస్తూ, తనకు గరగపర్రులో 50 సెంట్లు భూమి ఉందని, ఆన్లైన్ లో 43 సెంట్లు మాత్రమే చూపిస్తున్నదని, 7 సెంట్లు భూమి తగ్గిందని, రీ సర్వ్ చేయించి ఆన్లైన్ లో 50 సెంట్లు గా నమోదు చేయించి హద్దులు చూపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయో వృద్ధుల సంక్షేమ అప్పీల్లేట్ ట్రిబ్యునల్ మెంబెర్ మేళం దుర్గాప్రసాద్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
