అమృతతుల్యమైన రక్తాన్ని దానం ఇవ్వడం ద్వారా మరొకరికి ప్రాణదాతగా నిలవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు

బుధవారం పశ్చిమ గోదావరి శాఖ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భీమవరం టౌన్ హాల్లో నిర్వహించిన సి.పి.ఆర్ అవగాహన వారోత్సవం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా సిపిఆర్ ప్రక్రియను చేసి చూపించారు. అనంతరం రక్తదాతలతో మాట్లాడి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రాణరక్షణకు ప్రతి ఒక్కరు సి.పి.ఆర్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడమే సిపిఆర్ వారోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు. సిపిఆర్ పై అవగాహన కలిగి ఉంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడడానికి వీలవుతుందన్నారు.
రక్తదానం అనేది బృహత్తర కార్యమని, రక్తదానం ద్వారా సేకరించిన రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల ప్రాణాలను కాపాడడానికి వీలవుతుందన్నారు. రక్తం స్వయంగా ఉత్పత్తి చేయలేనిదని, కేవలం రక్తం సేకరణ ద్వారానే సాధ్యం అన్నారు. రక్తాన్ని ముందుగా సేకరించి సరైన పద్ధతుల్లో నిల్వ ఉంచి, అవసరమైన వారికి వినియోగించడం జరుగుతుందని, అప్పటికప్పుడు రక్తం సేకరించడం కష్ట సాధ్యం అన్నారు. దీని కారణంగానే రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడేందుకు సహకారం అందించాలన్నారు. నేడు నిర్వహించిన రక్తదాన శిబిరంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారులు సుమారు 350 మంది పాల్గొనడం ఎంతో సంతోషించదగిన విషయమని, రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.
తొలుత రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా శాఖ అధ్యక్షురాలు చదలవాడ నాగరాణి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
పశ్చిమగోదావరి జిల్లా శాఖ రెడ్ క్రాస్ చైర్మన్ డా.ఎం.ఎస్.వి.ఎస్. భద్రి రాజు మాట్లాడుతూ ప్రజలందరూ సి.పి.ఆర్ శిక్షణ పొందాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ రోజు కాపు కళ్యాణ మండపం వద్ద మహిళల కోసం, ఆదర్శనగర్ కోదండ రామాలయం వద్ద ప్రజల కోసం సి.పి.ఆర్. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డిఎంహెచ్‌ఓ గీతా బాయి, రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ ఓబిలిశెట్టి కనకరాజు, రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ప్రవీణ్, రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ గోపిశెట్టి మురళీ కృష్ణారావు, కోఆర్డినేటర్ శీలం మల్లేశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖ వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.