అమరావతిలో ఆదివారం జరిగే పి-4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుండి పెద్ద ఎత్తున భాగస్వామ్యం ఉండేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి ఆదివారం అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న పి-4 కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా నుండి రైతులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు జిల్లా నుండి హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ, డి ఆర్ డి ఎ, పరిశ్రమల, మత్స్య, ఎస్సీ, బీసీ, సంక్షేమ, మెప్మా, విద్యాశాఖల అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లు, ఎం పి డి వో లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు,
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రారంభించనున్న పి-4 కార్యక్రమానికి హాజరయ్యే వారికిఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వారికి త్రాగునీరు, అల్పాహారం, భోజనం తప్పనిసరిగా అందించాలని అన్నారు. వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున బస్సుల్లో త్రాగునీటితో పాటు, ఓ ఆర్ ఎస్, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఉండి, నియోజకవర్గాల నుండి రెండు బస్సులు చొప్పున, ఆచంట నియోజకవర్గం నుండి ఒక బస్సు మొత్తం 13 బస్సులను స్థానికంగా తెలియజేసిన పాయింట్ నుండి బయలుదేరడానికి సిద్ధం చేయాలన్నారు. ఉదయం 10:30 కి బస్సులు బయలుదేరేలా చూసుకోవాలని మధ్యాహ్నం 2.30 గంటల లోపుగా అమరావతి చేరుకునేలా అధికారులందరూ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి బస్సులో ఒక లైజనింగ్ ఆఫీసర్, ఒక ఏఎన్ఎం, ఒక కానిస్టేబుల్, డిఆర్డిఏ నుండి ఒక సి.సి తప్పనిసరి వెళ్లాలని అన్నారు. బస్సులు బయలుదేరిన సమయం నుండి తిరిగి మరల వచ్చేవరకు సంబంధిత శాఖల అధికారులదే పూర్తి బాధ్యత అన్నారు. సంబంధిత శాఖ అధికారులు అందరూ సమన్వయంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, డి ఈ ఓ ఇ .నారాయణ,జిల్లా లేబర్ ఆఫీసర్ ఏ.లక్ష్మి, సిపిఓ కె.శ్రీనివాసరావు, జిల్లా మత్స్య శాఖ అధికారి ఆర్ వి ఎస్ ప్రసాద్, ఏపీఎస్ ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ బాలసుబ్రమణ్యం, ఏపీ డి శ్రీనివాస్, మెప్మా డిస్టిక్ కోఆర్డినేటర్ సిహెచ్ నాని బాబు, డి టి ఎం సన్యాసిరావు, భీమవరం వన్ టౌన్ ఎస్ ఐ ఎం నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.