అన్నదాత సుఖీభవ పథకం అమలు తీరుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

రైతులకు లాభసాటి వ్యవసాయం, వారి జీవన ప్రమాణాలు పెరిగేలా గిట్టుబాటు ధరలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు పంపిణీ చేయనున్న కార్యక్రమాన్ని వేడుకగా జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజల విశ్వాసానికి తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సుపరిపాలన అందించడమే లక్ష్యమన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు కలిగే ప్రయోజనంపై గ్రామాలలో అవగాహన కల్పించాలన్నారు. ఆగస్టు రెండో తేదీన అన్నదాత సుఖీభవ కింద రైతులకు నగదు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. రైతులను చైతన్య పరచడం ద్వారానే రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నింటిలోకి తెస్తున్నామన్నారు. భవిష్యత్తులో ప్రజలకు బాధ్యతగా సేవలందించేలా వాట్సాప్ గవర్నెన్స్ వస్తుందన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. లోపాలు సవరించడానికే ఆర్ టి జి ఎస్ ,(రియల్ టైం గవర్నెన్స్ సిస్టం)ను ప్రవేశపెట్టామని, పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగు, సాగునీటి చెరువులన్నింటిని సమృద్ధిగా జలాలతో నింపాలన్నారు. వాటిపై నిర్వహణ, పర్యవేక్షణ ఉంటే సుస్థిర వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయ రంగంలో జిడిపి పెరుగుతుందని, ఈ విషయాలపై రైతులకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా ఆర్ ఎస్ కె లు, సచివాలయాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల సందేహాలన్ని నివృత్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డితో పాటు సిపిఒ కంటిపూడి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జడ్. వెంకటేశ్వరరావు, డ్వామా పీ డి కెసిహెచ్ అప్పారావు, డిపిఓ ఎం.రామనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.