Close

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపుగా పరిష్కారం చూపాలి–జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి

Publish Date : 09/09/2025

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై. దోసి రెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

ఈరోజు వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలనుంచి 192 అర్జీలు అందాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, పిజిఆర్ఎస్ లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్ర స్థాయిలోనే మంచి పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.

ఈరోజు పిజిఆర్ఎస్ కు అందిన ఫిర్యాదులలో ముఖ్యమైనవి కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

@. కాళ్ల మండలం బొండాడ గ్రామానికి చెందిన పొన్నంపల్లి వెంకటలక్ష్మి అర్జీని సమర్పిస్తూ, నా భర్త 2024లో చనిపోయారని, నాకు ముగ్గురు పిల్లలని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానన్నారు. వితంతు పెన్షన్ మంజూరు కొరకు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని, దయచేసి తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.

@. తాడేపల్లిగూడెం 32వ వార్డు వాస్తవ్యురాలు తోట శశిరేఖ అర్జీని సమర్పిస్తూ, నా కుమారుడు తోట శ్రీను, కోడలు జ్యోతి నన్ను ఇంటి నుంచి వెళ్లిపొమ్మంటు ప్రతిరోజు చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. నా ఇంటిని, ఒక ఎకరం పొలాన్ని వాటాల రూపంగా రాసి ఇచ్చానన్నారు. నాకు ప్రాణహాని ఉందని దయచేసి నా ఇల్లు, పొలంపై నాకు హక్కులు కల్పించాలని కోరారు.

@. వీరవాసరం మండలం పెరికిపాలెం గ్రామానికి చెందిన పోసినశెట్టి వాసుదేవ స్వామీజీ తనకు 1.76 సెంట్ల వ్యవసాయ భూమి ఉందని, సమీప రైతు అనధికారికంగా రొయ్యల చెరువు తవ్వి సాగు చేస్తున్నారని దీని వల్ల నా భూమి చౌడు బారిపోయి ఆర్థికంగా నష్టం జరుగుతోందన్నారు. దయచేసి అనధికార చెరువును తొలగించి తనకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు.

@. పాలకొల్లు పట్టణం 30వ వార్డుకు చెందిన కురుమెళ్ళ అప్పారావు అర్జీని సమర్పిస్తూ, మూడు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ కారణంగా తన కాలు తీసివేశారని, ప్రస్తుతం ఏ పని చేయలేకపో తున్నానన్నారు. ఇప్పటి వరకు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటానని, దయచేసి వికలాంగు పించనుగా మార్పు చేసి వికలాంగు పింఛన్ మంజూరు చేయాలని కోరారు.

@. పాలకొల్లు శ్రీరామపేటకు చెందిన బేరం మల్లికార్జునరావు అర్జీ సమర్పిస్తూ, నా భార్య,నా రెండో కుమార్తె నా దగ్గర ఉన్న డబ్బు, నా పేరున వున్న దస్తావేజు కోసం పలు రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. నేను తినే ఆహారంలో విషం కలిపి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దయచేసి నా భార్య, రెండవ కుమార్తెపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

@. పాలకోడేరు మండలం విస్సాకోడేరుకు చెందిన కూనపు శ్రీనివాస్, తాను పుట్టుకతో వికలాంగుడునని ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నానని నా పోషణ నిమిత్తం దయచేసి అంత్యోదయ కార్డు ఇప్పించాలని అర్జీని సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిపునల్ సభ్యులు దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.