అధికారులంతా ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలి..సెలవులు రద్దు -జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భారీ వర్షాల పట్ల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి.
కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 08816 299181 ఏర్పాటు
వాతావరణ శాఖ భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని, దీని కారణంగా ఏపీకి మరో మూడు రోజులు భారీ వర్షసూచన ఉన్నట్టు ప్రకటించడం జరిగిందన్నారు. 11జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగిందన్నారు. గంటకు 30-40 కి.మీ. వేగంతో తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. గోదావరి నదికి వరద ఉధృతి దృష్ట్యా ప్రజలెవ్వరూ నదిలోకి వెళ్లవద్దని, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయవద్దన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి ప్రాణ, ధన నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు పైప్ లైన్ల ను తనిఖీ చేయాలనీ, మంచినీటి పైప్ లు ఉన్న చోట డ్రైనేజి పైప్ లు లేకుండా చూడాలని, ప్రజలకు సురక్షిత తాగు నీరందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అత్యవసర మందులు, క్లోరిన్, బ్లీచింగ్ తదితర సామాగ్రి తో సిద్ధంగా ఉండాలని తెలిపారు. పారిశుధ్యం బాగుండాలని, ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలని క్షేత్ర స్థాయి పర్యవేక్షణలు చేస్తూ ఏదైనా సంఘటన జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా ఉండాలని తెలిపారు. అత్యవసర సమయంలో వినియోగం నిమిత్తం మోటార్ బోట్లు, గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి అత్యవసర సమాచారాన్ని తెలియజేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులంతా వారి ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, ఏ ఒక్కరికి సెలవులు మంజూరు చేయడం జరగదని స్పష్టం చేసారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 08816 299181 ఏర్పాటు చేయడం జరిగిందని, 24/7 డ్యూటీ లో సిబ్బంది ఉంటారని, అత్యవసర సేవల కోసం ప్రజలు, అధికారులు కాల్ చేయాలని తెలిపారు.