Close

అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో విలువైనదని, రక్త నిధిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 01/10/2025

తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో నూతన బ్లడ్ బ్యాంక్ ప్రారంభం…

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు బ్లడ్ బ్యాంక్ ను అందుబాటులోనికి తీసుకొచ్చాం..

స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు ప్రారంభం. ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసంలో భాగంగా సీమంతాలు, అన్నప్రాసన నిర్వహణ…

మహిళలు, ఆడపిల్లలను ఆరోగ్యంగా ఉంచే లక్ష్యంతో మెడికల్ క్యాంపుల ద్వారా పరీక్షలు నిర్వహణ

.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
.. శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్

బుధవారం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన బ్లడ్ బ్యాంకు ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా ప్రారంభించారు. తొలుత రక్తదానం చేస్తున్న పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ప్రాణాలను కాపాడేందుకు రక్తం ఎంత విలువైనదన్నారు. రక్తం తయారు చేయలేనిదని, రక్తం సేకరణ ద్వారానే సాధ్యం అన్నారు. ఆసుపత్రికి వేలాదిమంది పేదలు ప్రతిరోజు వైద్యం నిమిత్తం వస్తారని అవసరమైన వారికి రక్తాన్ని ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ లేని కారణంగా బయట నుండి తెప్పించి వినియోగించాల్సి ఉండేదని, దీని వలన కాలయాపన కూడా జరిగేదన్నారు. రక్తాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు.

తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ఇది రెండవ బ్లడ్ బ్యాంక్ అని, ఏరియా ఆసుపత్రికి సొంతంగా బ్లడ్ బ్యాంకు ను సమకూర్చుకోవడం చాలా సంతోషించదగిన విషయం అన్నారు. తాడేపల్లిగూడెం నేషనల్ హైవే పరిధిలో ప్రమాదాలకు గురైన సందర్భంలో అత్యవసరంగా రక్తం అవసరం అవుతుందని, నేడు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ సమస్య తీరిందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే సూత్రధారులు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

*స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రభుత్వ విప్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంపు ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్సను, మందులను అందజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు ముందస్తు పరీక్షల ద్వారా అనారోగ్యం నుండి తమని తమరు కాపాడుకోవచ్చునని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటుచేసిన పౌష్టికాహార వస్తువుల ప్రదర్శనను తిలకించారు. తల్లి, బిడ్డలకు బాలామృతాన్ని సక్రమంగా అందజేయడంతో పాటు, పౌష్టికాహారం వలన కలిగే ప్రయోజనాలను వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సందర్భంలో గర్భవతులకు సీమంతాలను నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చివరిగా రాష్ట్రీయ పోషణ మాసం – 2025 సెల్ఫీ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్, డిఎంహెచ్ఓ, ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి సెల్ఫీని దిగడం ద్వారా ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ డాక్టర్ జి.గీతా బాయి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, ఐసిడిఎస్ పి.డి డి.శ్రీలక్ష్మి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.రవిపాల్, సిడిపిఓ టి.ఎల్ సరస్వతి, స్థానిక జె.ఎస్.పి నాయకుడు వర్తనపల్లి కాశీ, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆసుపు స్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు సుబ్బరాజు, తాతాజీ, శ్రీను, రఘు, ఆసుపత్రి వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.