అత్యధిక సార్లు రక్తదాతలు స్ఫూర్తిదాయకం–జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ చదలవాడ నాగరాణి
ప్రతి ఒక్కరు రక్తదాతలు కావాలి..
కృత్రిమంగా పొందలేనిది రక్తం..
సకాలంలో రక్తము అందుబాటులో లేక ఏ ఒక్కరి ప్రాణము పోకూడదు.
జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా కలెక్టరేట్ వశిష్టా సమావేశ మందిరం నందు రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమగోదావరి జిల్లా యూనిట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, రక్తం దానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో మరొకరికి ప్రాణం పోసినట్లేనని తద్వారా ఒక కుటుంబం ఆనందంగా జీవించగలుగుతారన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రమాదం జరిగిన మొదటి గంటలో రక్తం అందజేస్తే విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు వస్తే ప్రాణాన్ని కాపాడడమే కాక, సమాజ సేవ చేసిన వారు అవుతారన్నారు. రక్తదానాన్ని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. రక్తదాన విలువలు ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సకాలంలో రోగులకు రక్తం అందక ఒక్క ప్రాణం పోకూడదన్నారు. ఇటీవల భీమవరంలో ప్రారంభించుకున్న బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసరమైన రోగులకు సకాలంలో రక్తం అందించడం జరుగుతోందన్నారు. జిల్లాలో 19 వేల యూనిట్లు రక్తం అవసరం కాగా 15 వేల యూనిట్లు సేకరణ జరుగుతుందని మిగిలిన 4 వేల యూనిట్ల సేకరణకు దాతలు ముందుకు రావాలన్నారు. వివిధ శాఖల అధికారులు రక్తం దానం చేయడంతో పాటు వారి సిబ్బందిని మరియు ప్రజలను రక్తదానంపై ప్రోత్సహించడం పట్ల కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా అత్యధిక సార్లు రక్త దానం చేసిన దాతలను, రక్త దానానికి ప్రోత్సహించిన వారికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా శాలువాతో సత్కరించి మేముంటోలను అందజేశారు.
అనంతరం ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా సంవత్సరానికి మూడుసార్లు దానం చేస్తానని హాజరైన సభ్యులచేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం.ఎస్.వి శివరామ భద్రరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జి.గీతాబాయి, డిప్యూటీ డిఎంహెచ్ఓ బి.భాను నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, డీఈవో ఇ.నారాయణ, ఆర్టీవో ఉమామహేశ్వరరావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి డి.లక్ష్మి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్లు కె.రామచంద్రారెడ్డి, ఏసుబాబు, వబిలిశెట్టి శెట్టి కనకరాజు, పదుల సంఖ్యలో రక్త దానం చేసిన దాతలు, రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు, చర్చ్ ఆఫ్ గాడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.